మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాము
అందుకే ప్రజలు దీవించారు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్
తాడేపల్లి సెప్టెంబర్ 20
ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. పరిషత్ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 13,081 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీల్లో(81 శాతం) వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల (99 శాతం) వైఎస్సార్ అభ్యర్థులే గెలిచారని తెలిపారు.86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని అన్నారు. ప్రతిపక్షం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందన్నారు. కోవిడ్ పేరుతో గతంలో కౌంటింగ్ కూడా వాయిదా వేయించారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.