YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిజామాబాద్ లో 204 కోట్ల రూపాయిల చెక్కులు

నిజామాబాద్ లో 204 కోట్ల రూపాయిల చెక్కులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు చెక్కుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఎం.రాంమోహన్‌రావు తెలిపారు. మొత్తం 436 గ్రామాల్లో 2,39,712మంది రైతులకు 204కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 10 నుండి 18వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లోనూ చెక్కుల పంపిణీ పూర్తయ్యేలా, రైతుల సంఖ్యకు అనుగుణంగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కాగా, వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి కానివ్వకుండా సాధ్యమైనంత త్వరగా చెక్కుల పంపిణీ పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగాలు చర్యలు చేపట్టాలని  ఆదేశించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ, రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలువాలనే సంకల్పంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందస్తు పెట్టుబడులను అందించేందుకు ముందుకు వచ్చిందని, ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు అవకాశం లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా చెక్‌లిస్టులను రూపొందించుకుని, చెక్కుల పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా రైతులకు చెక్కులతో పాటు పట్టాదార్ పాస్‌బుక్కులు కూడా అదే రోజున అందజేయాలని సూచించారు. ఒకరోజు ముందుగానే గ్రామాలలో చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీకి సంబంధించిన సమాచారం అందించాలని ఆదేశించారు. వీటి పంపిణీని చేపట్టే ప్రాంతాల్లో ఎండ వేడిమి బారినపడకుండా టెంటు, తాగునీటి వసతి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఏ చిన్నపాటి ఇబ్బందికి సైతం గురికాకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. ఇదిలాఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రత అంతకంతకూ పెరుగుతోందని, వడగాలుల ప్రభావంతో అక్కడక్కడా మరణాలు కూడా సంభవిస్తున్నాయని సీఎస్ జోషి ఆందోళన వ్యక్తం చేశారు. వడగాల్పుల బారినపడి అనారోగ్యాలకు గురి కాకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా వడదెబ్బ మరణాలు సంభవిస్తే, ఎస్‌ఐ, తహశీల్దార్, వైద్యాధికారితో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ధారించిన మీదట ఆపద్బంధు పథకం కింద బాధిత కుటుంబానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు చేయాలన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ దాహార్తి సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించుకుని నివేదికలు సమర్పించాలని ఆదేశించారు

Related Posts