YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

హ్యాట్రిక్ కొట్టిన ట్రూడో

హ్యాట్రిక్ కొట్టిన ట్రూడో

హ్యాట్రిక్ కొట్టిన ట్రూడో
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21,
కెనడా ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో నాయకత్వంలోని లిబరల్స్ పార్టీ అధికారం నిలబెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో లిబరల్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందినా.. స్పష్టమైన మెజార్టీ మాత్రం సాధించలేకపోయింది. కరోనా వ్యాక్సినేషన్‌ను సాఫీగా కొనసాగించేందుకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలని గత నెలలో ట్రూడో ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే, ఈ విజ్ఞ‌ప్తిని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ ఐదు వారాల ప్రచారంలో ట్రూడో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.పార్లమెంట్‌లో మెజారిటీని కోల్పోవడంతో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని అంతా భావించారు. అయితే, సోమవారం జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన జయభేరి మోగించారు. మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయినా మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తన కుటుంబంతో కలిసి విక్టోరియా గాలాలో ప్రజలనుద్దేశించి జస్టిన్ ట్రూడో ప్రసంగించారు. ఈ మహమ్మారి చీకటి రోజుల నుంచి వెలుగుల్లోకి ప్రయాణించేందుకు తనకు మళ్లీ అధికారం అప్పగించారని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు అని చెప్పారు.ట్రూడో విజయం సాధించినప్పటికీ ప్రజలు ఆయనపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని చెప్పిన ఆయన.. అంతలోనే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. కరోనా కట్టడిలో ట్రూడో సగమే మంచిగా పనిచేశారని కొందరు.. ట్రూడో బాగా పనిచేశారని ఇంకొదరు చెబుతున్నారు.కాగా, తమపై (లిబరల్స్) నమ్మకం ఉంచినందుకు ప్రజలందరికీ ట్రూడో ధన్యవాదాలు తెలిపారు.. కరోనాపై పోరును ముందుకు తీసుకెళ్తామని, మహమ్మారిపై గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, 2015 ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న ట్రూడో.. 2019 ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే, ఈ ఆరేళ్లలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. పార్లమెంట్ గడువు మరో రెండేళ్లు ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.కఠినమైన ఆంక్షల్ని విధించి కరోనా మహమ్మారి కొమ్ములు వంచిన జస్టిన్‌ ట్రూడో అదే తనని మళ్లీ విజయతీరాలకు నడిపిస్తుందన్న ధీమాతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమై విజయం సాధించారు. కరోనాని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకొని కన్జర్వేటివ్‌ నాయకుడు ఎరిన్‌ ఒ టూలే నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. వాతావరణ మార్పులపై చర్యలు, కోవిడ్ -19 టీకాలు, వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లు ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా చేసుకున్నారు.కెనడాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు కూడా ప్రకటిస్తారు.మొత్తం 338 స్థానాలున్న కెనడా పార్లమెంటులో సాధారణ మెజార్టీ 170. అయితే, లిబరల్‌ పార్టీ ఈసారి కూడా మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో 155 స్థానాలు సాధించి ఇతర పార్టీలతో కలిసి మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారు. ప్రధాని ట్రూడో కీలక నిర్ణయాలకి భాగస్వామ్యపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది.

Related Posts