పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి
అధికారులకు సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 22
రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లోగల భూసేకరణ,ఇతర సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అధికారులను ఆదేశించారు.బుధవారం అమరావతి సచివాలయంలో రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో కలిసి రైల్వే అధికారులు,రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని రైల్వే అధికారులకు సూచించారు.అలాగే ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను నిర్దేశిత గడువు ప్రకారం వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల సంయుక్త కలక్టర్లను ఇతర అధికారులను సిఎస్ ఆదేశించారు.వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మిగతా వ్యయాన్ని రైల్వే శాఖ భరించి ఆయా పెండింగ్ ప్రాజెక్టులన్నిటినీ త్వరితంగా పూర్తి చేసేందుకు రైల్వేశాఖ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.కడప-బెంగుళూర్ రైల్వే లైను ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రతినెల ప్రగతి సమీక్షలో సమీక్షిస్తున్నందున ఆప్రాజెక్టు పనులను మరింత వేగవతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ రైల్వే అధికారులకు సూచించారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు కాస్ట్ షేరింగ్ విధానంలో భరించాల్సిన నిధులను సకాలంలో వెచ్చించి ఆయా రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.నిర్మాణం పూర్తయిన రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి అప్రోచ్ రోడ్లు,విద్యుత్ లైన్లకు చెందిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కోరారు.
సమావేశంలో రాష్ట్ర టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టు సంబంధించి భూసేకరణ,ఇతర పలు పెండింగ్ అంశాలను వివరించారు.
అంతకు ముందు విజయవాడ-ఖాజీపేట మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం,కోటిపల్లి-నర్సాపురం, నడికుడి-శ్రీకాళహస్తి,గుంటూరు-గుంతకల్లు,కడప-బెంగుళూర్ రైల్వే లైను ప్రాజెక్టులు,అలాగే భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైను ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.అదే విధంగా నిడదవోలు-భీమవరం,భీమవరం-విజయవాడ రైల్వే లైను డబ్లింగ్ మరియు విద్యుదీ కరణ పనులు,పలు రైల్వే ఓవర్ బ్రిడ్జిల(ఆర్ఓబి)నిర్మాణం తదితర పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల ప్రగతిని ఈసమావేశంలో సమీక్షించారు.
ఈసమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,ఆశాఖ ఇఓ కార్యదర్శి కె.సత్యనారాయణ,అర్జా శ్రీకాంత్,రైల్వే డిఆర్ యం శివేంద్ర మోహన్,ఎడిఆర్ఎం డి.శ్రీనివాస రావు,సిఏఓ అమిత్ గోయల్,సిఇలు రమేశ్ కుమార్,ఎంవిఎస్ రామరాజు,బి.విశ్వనాధ్ ఇతర రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.