ముంబై, సెప్టెంబర్ 23,
కరోనా రక్కసి వల్ల ఎన్నడూ లేనంతగా నష్టపోయిన టీవీ, ఏసీ, ఫ్రిజ్‌ల కంపెనీలు ఈసారి పండగ సీజన్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. గత ఏడాది వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ఇది అనువైన టైమని అనుకుంటున్నాయి. ఈసారి రెండంకెల గ్రోత్ ఉండొచ్చనేది కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండస్ట్రీ ఎక్స్పర్టుల అంచనా. ముడిసరుకులు ధరలు ఎక్కువ కావడంతో ఈ ఏడాది కంపెనీలు ఇప్పటికే రెండుసార్లు ధరలను పెంచాయి. అయినప్పటికీ పండుగ సీజన్‌లో కొనుగోళ్లు బాగుంటాయని ఆశిస్తున్నాయి. చాలా కంపెనీలు ఇది వరకే భారీ ఆఫర్లను కూడా ప్రకటించాయి. అయితే చిప్‌సెట్‌ల వంటి విడిభాగాల కొరత, థర్డ్ వేవ్ వస్తుందేమోనని భయాలూ ఉన్నాయి. పానాసోనిక్, ఎల్జీ, హాయర్, గోద్రెజ్ అప్లయెన్సెస్ , లాయిడ్స్ వంటివి.. టీవీలు, ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషిన్‌లు, రిఫ్రిజిరేటర్ల వంటి ప్రీమియం ప్రొడక్టులు బాగా అమ్ముడవుతాయని నమ్మకంగా చెబుతున్నాయి. తమ సప్లై చెయిన్‌ను, ఇన్వెంటరీని పండుగ సీజన్ కోసం సిద్ధంగా ఉంచుతున్నాయి. మనదేశంలో పండగ సందడి దసరా నుండి ప్రారంభమై దీపావళి వరకు ఉంటుంది. సాధారణంగా మొత్తం అమ్మకాల్లో పండగ నెల అమ్మకాల వాటా 30 శాతం వరకు ఉంటుందిగోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది మాట్లాడుతూ, థర్డ్ వేవ్ పై ఆందోళనలు ఉన్నప్పటికీ, వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్నందున, గిరాకీలు బాగుంటాయని అన్నారు.‘‘పండుగ సీజన్ సేల్స్ సాధారణంగా మా ఏడాది అమ్మకాలలో 30 శాతం వరకు ఉంటాయి. ఇప్పుడు డిమాండ్ పుంజుకుంటోంది. ఈసారి అమ్మకాలను 20 శాతం పెంచాలని టార్గెట్‌గా పెట్టుకున్నాము" అని ఆయన చెప్పారు. లాయిడ్ సీఈఓ శశి అరోరా మాట్లాడుతూ సెకండ్ వేవ్ ఎఫెక్ట్, ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉన్నా, ఈ పండుగ సీజన్‌లో కన్జూమర్ల సెంటిమెంట్ బాగానే ఉందన్నారు. పండుగ సీజన్ పరిశ్రమను నష్టాల నుంచి బయటపడేలా చేస్తుందన్నారు. ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు , వాషింగ్ మెషీన్‌ల అమ్మకాలు పెరుగుతాయనే నమ్మకం ఉందని అరోరా తెలిపారు. కిందట సంవత్సరం దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల కన్జూమర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే కొన్ని నెలల తరువాత కోలుకుంది. పండుగ సీజన్లో అమ్మకాల ఊపందుకున్నాయి. మహమ్మారికి ముందు, అంటే 2019 లో ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ మార్కెట్ విలువ సుమారు రూ. 76,400 కోట్లుగా రికార్డయింది.పండగ సీజన్‌ను సొమ్ము చేసుకోవడానికి కంపెనీలు, రిటైలర్లు ఆఫర్లతో ఊరిస్తున్నారు. ఇందుకోసం ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. క్యాష్ బ్యాక్‌లు, ఈజీ ఫైనాన్స్ ఆప్షన్‌లు జీరో డౌన్ పేమెంట్ , ఈఎంఐ స్కీమ్‌లతో కస్టమర్లను ఊరిస్తున్నారు. కొత్త మోడళ్లను విడుదల చేస్తామని కూడా చెబుతున్నారు. టీవీలు, కనెక్టెడ్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లు , ఇతర లైఫ్‌స్టైల్ వస్తువులకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్నదని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ మనీష్ శర్మ చెప్పారు. డిమాండ్ పుంజుకోవడం వల్ల కంపెనీ గత ఏడాది కంటే ఈ ఏడాది ఆగస్టులో 25 శాతం గ్రోత్‌ను సాధించిందని ఆయన అన్నారు. ‘‘మహమ్మారి వల్ల వచ్చిన నష్టాలను భర్తీ చేయడానికి పండుగ సీజన్‌ను మేం ఉపయోగించుంటాం. గ్రోత్ వేగం కొనసాగుతుందని మేం అనుకుంటున్నాం” అని ఆయన వివరించారు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ కంపెనీ ఎల్జీ కూడా పండుగ సీజన్ కోసం పలు ప్రీమియం ప్రొడక్టులను లాంచ్ చేసింది. "ప్రస్తుతం కన్జూమర్ల సెంటిమెంట్ చాలా పాజిటివ్‌గా ఉంది. వర్క్ ఫ్రమ్ హోం వల్ల డ్యూరబుల్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రయాణాలు తగ్గాయి. చాలా మంది కన్జూమర్లు తమ ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు’’ అని ఎల్జీ ఇండియా వైస్– ప్రెసిడెంట్ (కార్పొరేట్ ప్లానింగ్ ) దీపక్ బన్సల్ అన్నారు. కంపెనీలు ప్రీమియం సెగ్మెంట్లలో మంచి గ్రోత్‌ను సాధిస్తున్నాయని చెప్పారు. హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ, ఈ సంవత్సరం మనకు సవాళ్లు ఎదురయ్యాయని, మహమ్మారి జనాన్ని ఇండ్లకే పరిమితం చేసిందని చెప్పారు. ఇది కన్జూమర్ల ప్రవర్తన , హోం అప్లియెన్సెస్ పరిశ్రమలో మార్పునకు దారితీసిందని అన్నారు. ప్రస్తుత ట్రెండ్స్ బాగున్నాయని, రాబోయే రోజుల్లో డిమాండ్ ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. తమ కస్టమర్లకు క్యాష్‌బ్యాక్, ఫైనాన్స్ పథకాల వంటి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించామని వివరించారు.