అలహాబాద్, సెప్టెంబర్ 23,
గంటలు గడుస్తున్నాయ్.. రోజులు పూర్తవుతున్నాయ్.. కానీ నరేంద్రగిరి అఖాడా డెత్ మిస్టరీ మాత్రం వీడడం లేదు. నిన్నటిదాకా ఆయన మృతి చుట్టూ అనేక ప్రచారాలు నడిచాయి. ఆయన ఆత్మహత్యకు శిష్యుడు ఆనంద్‌గిరే కారణమంటూ భక్తులు ఆరోపించగా.. దానికి గట్టి కౌంటర్ ఇచ్చారు ఆనంద్‌గిరి. అసలు నరేంద్రగిరిది ఆత్మహత్య కాదని.. ఆయనను హత్య చేశారంటూ బాంబ్ పేల్చారు. అయితే.. తాజాగా మరో సంచలన విషయం వెలుగుచూసింది. నరేంద్రగిరి రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్ ఆనంద్‌గిరి చుట్టే తిరిగింది.ఇదిలావుంటే తాజాగా నిరంజని అఖారా చీఫ్ రవీంద్ర పురి కీలక ప్రకటన చేశారు. ప్రయాగరాజ్‌లోని బాఘంబరి మఠంలోని తన గదిలో ఉరి వేసుకుని చనిపోయిన మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ రాసినది కాదని పేర్కొన్నారు. “ఉబ్బిన కళ్ళు లేదా నాలుక కూడా బయటకు రాలేదు, అలాంటప్పుడు అతను ఉరి వేసుకుని ఎలా చనిపోతాడు?” అంటూ నిరంజని అఖారా చీఫ్ ప్రశ్నించారు. ఇదే కోణంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ సూసైడ్ నోట్‌ను పరిశీలించింది ఫోరెన్సిక్ టీమ్. లేటెస్ట్‌గా అధికారులు సూసైడ్ నోట్ రాసిన విషయాల్ని వెల్లడించారు. తనను శిష్యుడు ఆనంద్‌గిరితో సహా మరికొంత మంది బెదిరించారంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు నరేంద్రగిరి. ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించారని ఆరోపించారు. తాను బతికినా భయపడుతూ బతికే పరిస్థితులు సృష్టించారని సూసైడ్ నోట్‌లో రాశారు నరేంద్రగిరి. హనుమాన్ టెంపుల్ పూజారి ఆద్య తివారితో పాటు అతని కొడుకు సందీప్ తివారిపైనా ఆరోపణలు చేశారు నరేంద్రగిరి. తన ఆత్మహత్యకు కారణమైన వారిని చట్టప్రకారం శిక్షించాలని సూసైడ్‌నోట్‌లో పోలీసుల్ని కోరారుఇక.. నరేంద్రగిరి మృతిపై మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూమిని నరేంద్రగిరి బిల్డర్స్‌కు అమ్మేశారని.. ఈ విషయమై నరేంద్రగిరి.. అతని శిష్యుల మధ్య వివాదం తలెత్తిందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు.. నరేంద్రగిరి మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఆత్మహత్యగానే చెబుతున్నారు. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని సాధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమికంగా నరేంద్రగిరిది ఆత్మహత్యే అని చెబుతున్నా.. అతడి శిష్యులు మాత్రం ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్నారు.