హైదరాబాద్, సెప్టెంబర్ 23,
తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం ఇలాంటి పంచాయితీలు ఏవో ఒకటి కామన్. చీమ చిటుక్కుమన్నా హైకమాండ్‌కు వెంటనే ఫిర్యాదు చేసేస్తారు. పేచీలకు అదీ ఇదీ అనే విభజన రేఖ ఏదీ ఉండదు. ప్రస్తుతం అలాంటి ఒక అంశమే పార్టీలో చర్చగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతోందని ఉద్యమిస్తోన్న వామపక్ష పార్టీలతో అఖిలపక్ష సమావేశం పేరుతో మీటింగ్ నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి. కేంద్ర సర్కార్ విధానాలతోపాటు.. పోడు భూముల అంశంపై ఆందోళనకు దిగాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఈ మీటింగ్‌కు గాంధీభవన్ వేదికైంది. చాలా రోజుల తర్వాత లెఫ్ట్ పార్టీల నాయకులు గాంధీభవన్‌కు వచ్చారు. భారత్ బంద్‌తోపాటు.. పోడు భూముల సమస్యలపై ఆయా వర్గాలకు దగ్గర కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. గాంధీభవన్‌లో జరిగిన ఈ సమావేశమే కాంగ్రెస్ సీనియర్ నాయకులలో రచ్చకు కారణమైంది. అఖిలపక్షం పేరుతో నిర్వహించిన ఈ సమావేశాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తప్పు పడుతున్నారు. గాంధీభవన్‌లో జరిగిన భేటీపై కనీసం పార్టీ నాయకులమైన తమకు సమాచారం లేదని గుర్రుగా ఉన్నారట. ఇదే అంశాన్ని AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు ఫిర్యాదు చేశారట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌లు అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. గాంధీభవన్‌లో పార్టీ ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించేటప్పుడు ఇతర కాంగ్రెస్ నేతలకు చెప్పకుండా చేయడం ఏంటన్నది వారి ప్రశ్న.వాస్తవానికి పార్టీలో అందరికీ సమావేశంపై సమాచారం ఇవ్వాలని.. మీటింగ్‌కు వచ్చే వారిలో సమన్వయం చేసుకోవాలని తనకు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడికి పీసీసీ చీఫ్ చెప్పారట. ఆయనేమో.. సొంతపార్టీ నేతలకు సమాచారం ఇవ్వలేదట. ఇప్పుడీ కమ్యూనికేషన్ గ్యాపే కొత్త చర్చగా మారి.. రచ్చ రచ్చ అవుతోంది. కాంగ్రెస్ సీనియర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పీసీసీ చీఫ్ దగ్గర ప్రస్తావించారట పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్. సీనియర్లకు సమాచారం ఇవ్వకూడదనే ఆలోచన ఏమీ లేదని.. అఖిలపక్ష భేటీకి పార్టీ నుంచి ఒక్కరే వెళ్తారు కదా అని రేవంత్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.పీసీసీకి కొత్త కమిటీ వచ్చాక భారీ స్థాయిలో సభలు… సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా.. సీనియర్ల మధ్య పొసగడం లేదన్నది ఓపెన్ టాక్. ఇప్పటికే అనేక ఫిర్యాదు వెళ్లాయి. భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమాలకు కొందరు సీనియర్లు ఇప్పటికీ హాజరు కాలేదు. ఛాన్స్ చిక్కితే పైచెయ్యి సాధించే పనిలో ఉన్నారు. ఇప్పుడు గాంధీభవన్ మీటింగ్ కూడా ఈ కోవలోకే చేరి చర్చగా మారింది. మరి.. కాంగ్రెస్‌లో అంతే అని ఊరుకుంటారో.. లేక ఇలా జరిగితేనే అంతా అదుపులో ఉంటారని ఊరుకుంటారో చూడాలి