రంగారెడ్డి, సెప్టెంబర్ 23,
ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన ఆ మంత్రికి సొంతపార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారా? జిల్లాస్థాయి కీలక పదవిలో ఉన్న నేత రాజీనామాకు సిద్ధపడ్డారా? ప్రతిపక్ష పార్టీల విషయంలో చేయాల్సిన రాజకీయాలు సొంతపార్టీలో చేసి అధిష్ఠానాన్ని ఇరుకున పెడుతున్నారా? టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల కూర్పు.. ప్రకటనలు కొన్నిచోట్ల ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా నేతల రాజీనామాల వరకు వివాదాలు వెళ్తున్నాయి. దీనికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండల కమిటీ ఒక ఉదాహరణ. కమిటీ కూర్పు.. మంత్రి మల్లారెడ్డి, జడ్పీ ఛైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మధ్య చిచ్చుపెట్టింది. చాలా రోజులుగా కొనసాగుతున్న విభేదాలు ఈ విధంగా భగ్గుమన్నాయి.మండల కమిటీ ఏర్పాటుపై శరత్‌చంద్రారెడ్డి మనస్తాపం చెందారట. పార్టీ పెద్దల ఆదేశాలతో కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు జడ్పీ చైర్మన్ వద్దకు మంత్రి తరఫున వెళ్లి మంతనాలు జరిపారట. ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి చల్లబడినట్టు సమాచారం. మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని జడ్పీ ఛైర్మన్ వర్గం గుర్రుగా ఉంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం గ్రామ, మండల స్థాయిలో టీఆర్‌ఎస్ కమిటీలు వేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన నాయకులకు తెలియకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా మంత్రి కమిటీల నియామకం చేపడుతున్నట్టు సొంత పార్టీ నేతల ఆరోపణ. అదే అసంతృప్తి రూపంలో భగ్గుమంటోంది.అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సహకారం తీసుకుంటానని చెప్పిన మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారట. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తనయుడే శరత్ చంద్రారెడ్డి. పార్టీ కమిటీ ఏర్పాటులో తమ సొంత మండలంలో తమకు తెలియకుండా టీఆర్ఎస్ కమిటీ వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా సుధీర్‌రెడ్డి వ్యతిరేకులను మంత్రి చేరదీస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైగా ఘట్‌కేసర్ మండలంలో జడ్పీచైర్మన్ వర్గానికి పార్టీ, ప్రభుత్వ పరంగా సహకరించడం లేదట. ఇప్పుడు టీఆర్‌ఎస్ కమిటీల కూర్పులోనూ జడ్పీ ఛైర్మన్ అనుచరులకు చోటు కల్పించకపోవడంతో విభేదాలకు మరింతగా ఆజ్యం పోసినట్టు అయింది.టీఆర్ఎస్ కమిటీలతో విభేదాలు ముదురుపాకాన పడటంతో త్వరలోనే అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట జడ్పీ ఛైర్మన్. మంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతూ పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు తమకు రెండు రోజులు సమయం ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కోరినట్టు సమాచారం. దాంతో ఆయన డైలమాలో పడ్డారట. ప్రస్తుతం మేడ్చల్ టీఆర్ఎస్‌లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. మరి.. ఈ ఎపిసోడ్‌కు ఎలాంటి ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.