YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ పార్టీలో ముల్లుల భయం

గులాబీ పార్టీలో  ముల్లుల భయం

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో గులాబీ నేత‌ల బాగోతాలు ఒక్కొక్కటిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి జూప‌ల్లి కృష్ణారావు బ్యాంకు రుణాల లొల్లి, మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి క‌లెక్టరేట్ భ‌వ‌న నిర్మాణ స్థల‌ వివాదం స‌మ‌సిపోక‌ముందే.. తాజాగా.. ఆర్మూర్ టీఆర్ఎస్ నేత‌లు బంగారం కేసులో ఇరుకున్నారు. ఈ ప‌రిణామాలు అధికార టీఆర్ఎస్ పార్టీని ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి. ఇటీవ‌ల ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డికి ఎదురైన చేదుఅనుభ‌వాన్ని మ‌ర‌వ‌క‌ముందే ఆ పార్టీ నేత‌లు బంగారం కేసులో ఇరుక్కోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది. ఆర్మూర్‌ పట్టణం భూపాల్‌ మన్నా కేసు గులాబీ పార్టీలో లొల్లి పుట్టిస్తోంది.ఆభరణాల తయారీదారు మన్నా వద్ద బంగారం తీసుకొని పారిపోయేందుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీలో ఓ వర్గం పావులు కదుపుతోంది. మ‌రోవైపు బంగారు కేసులో నిందితుల‌ను కాపాడేంందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయ‌త్నం చేస్తున్నార‌ని విప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆర్మూరు మున్సిప‌ల్ చైర్‌ప‌ర్సన్ భ‌ర్త ఉన్నట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే బంగారం తీసుకొన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నాయకులతోపాటు మరికొందరు కౌన్సిలర్లను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వద్దకు వెళ్లారు.‘ కావాల‌ని ఇరికించారు.. తాను మన్నా ఇంటి వద్దకు వెళ్లలేదు.. బంగారం తీసుకోలేదంటూ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ప్రధాన వ్యక్తి ఎమ్మెల్యేతో మొరపెట్టుకొన్నట్లు తెలిసింది. త‌న‌ను రాజ‌కీయంగా దెబ్బ తీసేందుకు పార్టీలోనే కొందరు కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బృందం శనివారం ఉదయమే ఎమ్మెల్యేను కలిసిందని తెలుసుకొన్న టీఆర్ఎస్‌లోని మరో వర్గం హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. సదరు వ్యక్తుల కారణంగా పార్టీకి చెడ్డపేరు వచ్చింది.. చర్యలు తీసుకోకుంటే ఆర్మూరు నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర న‌ష్టం త‌ప్పద‌ని, వెంటనే చర్యలు తీసుకొంటే ప్రజ‌ల్లోకి మంచి సంకేతాలు వెళ్తాయని సూచించారు.

 ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డికి తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించే అవ‌కాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఏం చేయాలన్న అంశంపై ఎటూ పాలుపోని స్థితిలోఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా…బంగారాన్ని ఎత్తుకెళ్లిన కేసులో భాగస్వామ్యులైన టీఆర్ఎస్‌ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్మూర్‌లో రాస్తారోకో నిర్వహించారు. రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన వివిధ పార్టీల నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గులాబీ నేత‌ల‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ లొల్లిపై గులాబీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలిమ‌రి.

Related Posts