ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు వేగవంతం చేయండి
కమిషనర్ గిరీషా
తిరుపతి, మా ప్రతినిధి, సెప్టెంబర్23
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నిర్మిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కమిషనర్ గిరీషా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అర్బన్ హెల్త్ సెంటర్స్ నిర్మాణ పనులు, అమృత్ పనులు, జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణ పనులు పురోగతిపై గురువారం వై.ఏస్.ఆర్. సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వై.ఎస్.ఆర్. పట్టణ ఆరోగ్య కేంద్రాలను తిరుపతికి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. త్వరగా పనులు పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోనికి తేవచ్చునన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. ప్రజలందరికీ త్రాగునీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు, ప్రతి రోజు నీరు అందించేందుకు వీలుగా అమృత్ పథకంలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో కూడా కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి కాలేదని అవి కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకు ఇండ్లు కేటాయించిన జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు ఏ మేరకు జరుగుతున్నాయని తెలుసుకుని మరింత వేగంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఐదు లేఔట్ లలో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి మొత్తం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అధికారులు కిందిస్థాయి సిబ్బందిని సమన్వయ పరుచుకుని పనులు వేగవంతం చేయాలన్నారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి రెడ్డి, డి.ఈ. లు విజయకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, సంజయ్ కుమార్, గోమతి, దేవిక, తదితరులు ఉన్నారు.