ఏపీ అధికార పార్టీ నేతలు ప్రజల్లో తిరగలేక పోతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత చంద్ర బాబు వేస్తున్న అడుగులకు దీటుగా వారు ముందుకు సాగలేక పోతున్నారు. ఎక్కడికక్కడ నేతలు అనారోగ్యానికి, అస్వస్థతకు గురవుతున్నారు. ఫలితంగా టీడీపీ నేతలు చేపడుతున్న కార్యక్రమాలు మధ్యలోనే ముగిసిపోతున్నాయి. విషయంలోకి వెళ్తే.,. ఏపీకి కేంద్రం పెద్ద అన్యాయం చేసింది. ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించలేదు. మొత్తానికి ఈ పరిణామంపై చంద్రబాబు ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యమిస్తోంది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీలు నిర్వహించేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారు. మొన్న... ఏలూరులో ఎంపీ మాగంటి బాబు చేపట్టిన సైకిల్ యాత్రలో ఆయన మూర్ఛపోవడం, ఆస్పత్రి పాలవడం తెలిసిందే. నిన్న...ధర్మవరంలో సైకిల్ యాత్ర చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురై మార్గం మధ్యలో కుప్పకూ లారు. హుటాహుటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఉదయం ఆయన పోతుకుంట నుంచి ధర్మవరం పట్టణానికి 10 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. యాత్ర చేస్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేలా చంద్రబాబు ఎలాంటి వ్యూహం అమలు చేస్తారో చూడాలి.ఏపీకి న్యాయం చేసే వరకు ఊరుకునేది లేదంటూ.. అటు పార్టీ పక్షాన, ఇటు ప్రభుత్వం పక్షాన కూడా చంద్రబాబు ఉవ్వెత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 20న తన పుట్టిన రోజును పురస్కరించుకుని విజయవాడ కేంద్రంగా ధర్మ పోరాటా దీక్షను చేపట్టా రు. ఆ తర్వాత తిరుపతి వేదికగా అదే నెల 30న ధర్మపోరాట సభ పెట్టారు. అంతా బాగానే ఉంది. అయితే, పార్టీ తరఫున కూడా తమ్ముళ్లకు పెద్ద ఎత్తున టార్గెట్లు పెట్టారు. వారివారి నియోజకవర్గాల్లో సైకిల్ యాత్రలు నిర్వహించి కేంద్రంపై పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.