కొండమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
నెల్లూరు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గురువారం పర్యటించారు. ఆత్మకూరులో ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందిన కొండమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఆత్మకూరు లో జరిగిన కొండమ్మ ఘటన అందరిని తీవ్రంగా కలిచి వేసింది. ఆత్మహత్యకు ప్రేరేపిస్తూ భర్త చచ్చిపో చచ్చిపో అని రెచ్చగొట్టడం వల్లే కొండమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఇన్ని రోజులు కాపురం చేసిన భార్య కళ్ళముందు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాపాడకుండా వీడియో తీసి రాక్షసుడులా భర్త ప్రవర్తించాడు. ఉద్యోగం చేస్తూ తన కంటే ఉన్నత స్థాయిలో ఉందనే భావన, అనుమానం తోనే వేధించడంతో భార్య ఆత్మహత్యకు దారితీసి ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. అనాధలైన ఇద్దరు పిల్లల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. భర్తలు వేదిస్తూ ఉంటే మహిళలు ఆత్మహత్యలు చేసుకోవద్దు ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుంది. కొండమ్మ ఘటన వలన రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. సైకో భర్తలకు గుణపాఠం చెప్పాలి కానీ ప్రాణాలు తీసుకోవద్దని అన్నారు.
ఆడవారి మీద నేరాలు చేసే వారి మీద కఠినమైన శిక్షలు పడేలా పోలీసు వారు పూర్తిస్థాయిలో లోతుగా విచారించి చార్జిషీటు దాఖలు చేసేలా చూస్తామని, ఆత్మకూరు లో జరిగిన ఈ సంఘటన తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని కళ్ళముందే ఒక ప్రాణం పోతున్నా కనీసం కాపాడాలనే ఆలోచన లేకుండా రెచ్చగొట్టే మాటలతో ప్రవర్తించిన ఈ మానవ మృగానికి తగిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. విశాఖ జిల్లా లోని సీలేరు లో కూడా దివ్యాంగురాలు పై దాడికి పాల్పడ్డారు,అటువంటివారిని మనిషిగా గుర్తించరని అన్నారు.