YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*స్వప్నంలో అభయం..*

*స్వప్నంలో అభయం..*

"అయ్యగారూ..నేనూ మా అమ్మాయీ స్వామివారి సమాధి వద్దకు ఒక్కసారి వెళ్లివస్తాము..అమ్మాయి పదవతరగతి పరీక్షలు వ్రాస్తోంది..తన హాల్ టికెట్ స్వామివారి సమాధి వద్ద పెట్టి మొక్కుకుంటుందట.." అని ఆ తండ్రి అడిగాడు..సరే అన్నాను..ఆ తండ్రీ కూతుళ్లు ఇద్దరూ లోపలికి వెళ్లారు..స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసారు.. అమ్మాయి తన హాల్ టికెట్ స్వామివారి పాదుకల వద్ద పెట్టి నమస్కారం చేసుకొని, ఇవతలికి వచ్చి, నాకు కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయారు..పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చిన రెండు రోజుల తరువాత ఆ తండ్రీ కూతుళ్లు మళ్లీ వచ్చారు..అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయిందని..స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామని చెప్పారు.. ఆరోజు కూడా శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్లారు..

మరో మూడు నాలుగు నెలల తరువాత, ఆ అమ్మాయిని తీసుకొని తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చారు..అయితే ఈ సారి వాళ్ళు సమస్యతో వచ్చారు..అమ్మాయిని ఇంటర్మీడియట్ లో, ఆ అమ్మాయి కోరుకున్న కాలేజీ లో చేర్పించారు..కాలేజీకి వెళ్లిన నెల తరువాత అమ్మాయి ప్రవర్తన లో మార్పు వచ్చింది..ఉత్సాహం గా వుండే ఆ అమ్మాయి నిరాశగా ఉన్నది..ఒంటరిగా కూర్చుని ఏడవటం..చదవకుండా ఉండటం..ఆహారం తీసుకోక పోవడం..ఇలా కొద్దిగా విపరీతపు పోకడలు పోతున్నది..తల్లిదండ్రీకి ఏమీ పాలుపోలేదు..కాలేజీ లో ఏదన్నా సమస్య ఉన్నదా అని విచారించారు..ఏ సమస్యా లేదు..ఏం చేయాలి? లక్షణంగా చదువుకునే అమ్మాయి ఇలా తయారైందే అని బెంగ పడ్డారు..

"మనం మొదటినుంచీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామినే నమ్ముకొని ఉన్నాము..ఇప్పుడు కూడా ఆ స్వామివారినే శరణు వేడదాము..మరో మార్గం నాకు కనబడలేదు..అక్కడికే పోదాము.." అని ఆ తండ్రి చెప్పాడు..భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకొని అమ్మాయిని తీసుకొని మొగలిచెర్ల దత్తాత్రేయుడి సన్నిధికి చేరారు..ఆ అమ్మాయికి తలారా స్నానం చేయించి, అమ్మాయిని తీసుకొని స్వామివారి మంటపం లోకి వచ్చి, "స్వామీ నిన్నే నమ్ముకున్నాము..ఒక్కగానొక్క బిడ్డ మాకు..ఆ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూడు స్వామీ.." అని మనస్ఫూర్తిగా ప్రార్ధన చేసుకున్నారు..

అమ్మాయిని తీసుకొని మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసి, అమ్మాయిని కొద్దిసేపు మంటపం లో పడుకోబెట్టారు..అలా పడుకున్న కొద్దిసేపటి లోపే ఆ అమ్మాయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది..సుమారు రెండు మూడు గంటలు ఆ మంటపం లోనే నిద్ర పోయింది..నిద్ర లేచిన తరువాత, తల్లిదండ్రీ దగ్గరకు వచ్చి.."అమ్మా స్వామివారి సమాధి వద్దకు పోయి నమస్కారం చేసుకుందాము..పోదాం రండి.." అని పిలిచింది..వాళ్లిద్దరూ అమ్మాయి అలా పిలిచేసరికి.."అమ్మా..నీకెలా వుంది?" అని అడిగారు.."అమ్మా..వొళ్ళంతా తెలికై పోయినట్లు ఉంది..నా మీద నుంచి ఏదో పెద్ద బరువు తీసేసినట్లు ఉంది..ఎవరో వచ్చి నా తలమీద చేయి పెట్టి..ఇంకేమీ భయం లేదు అని చెప్పినట్లు అనిపించింది..మనం స్వామి దగ్గరకు పోదాము.." అని చెప్పింది..అమ్మాయిని తీసుకొని స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేశారు..ఆ రాత్రికి అక్కడే నిద్ర చేశారు..ప్రక్కరోజు మధ్యాహ్నానికి "అమ్మా మనం ఊరెళ్లి పోదాము..నేను కాలేజీకి పోతాను..చదువుకుంటాను.." అన్నది..ఆ పిల్ల ముఖం లో మునుపటి ఉత్సాహం కనబడుతోంది..మరొక్క రోజు కూడా స్వామివారి సన్నిధి లోనే వుండి ఆ తరువాత వాళ్ల ఊరెళ్లి పోయారు..

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు, అలాగే రెండవ సంవత్సరం..ఆ అమ్మాయి తండ్రితో కలిసి వచ్చి తన హాల్ టికెట్ స్వామివారి పాదుకల వద్ద పెట్టి నమస్కారం చేసుకొన్నది..మరెన్నడూ ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బందీ కలుగలేదు..

ఇంజినీరింగ్ కూడా పూర్తి చేసుకొని, ఉద్యోగం లో చేరి..తల్లిదండ్రులు కుదిర్చిన పిల్లవాడితో వివాహం స్వామివారి సన్నిధి లోనే చేసుకున్నది..

ఇప్పటి కూడా స్వామివారి సన్నిధికి వచ్చినప్పుడల్లా.."నా జీవితం మొత్తం ఈ స్వామివారి చల్లటి చూపు వల్లే చక్కగా వున్నదని" పదే పదే చెప్పుకుంటుంది..నమ్మిన వారికి స్వామివారి కరుణ ఎల్లవేళలా ఉంటుందని మరోసారి నిరూపితం అయింది..

Related Posts