విజయవాడ, సెప్టెంబర్ 24,
వాళ్లిద్దరూ మంచి మిత్రులు. రాజకీయాలకు అతీతంగా స్నేహం కొనసాగించారు. ఏ పార్టీలో ఉన్నా వారి మైత్రి కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య స్నేహానికి గండి పడినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చాలా కాలం నుంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా, వేర్వేరు పార్టీలో ఉన్నా ఒకరి రాజకీయాల గురించి మరొకరు పట్టించుకోరు. వ్యక్తిగత పరామర్శలు, వ్యాపార సంబంధమైన సంభాషణలే తప్ప మరొకదానికి చోటుండదు.వైసీపీలో ఇద్దరూ ఉన్నంత కాలం రాజకీయాల గురించి మాట్లాడుకునే వారు. ఆ తర్వాత వంగవీటి రాధా వైసీపీని వీడిపోయే సమయంలో ఆపేందుకు కొడాలి నాని చేయని ప్రయత్నం చేయలేదు. అయినా వంగవీటి రాధా తన రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీలోకి వెళ్లారు. వీకెండ్ లో హైదరాబాద్ లో ఇద్దరూ కలుసుకునే ఈ ఇద్దరు గత కొంత కాలంగా దూరంపాటిస్తున్నారని చెబుతున్నారు. ఇద్దరి మధ్య స్నేహం చెడిందని అంటున్నారు.ప్రస్తుతం వంగవీటి రాధా గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడే మకాం వేసి కాపు సామాజికవర్గం నేతలతో చర్చలు జరుపుతున్నారు. కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో వంగవీటి రాధా కాపు నేతలతో సమావేశాలు కొడాలికి రుచించడం లేదు. అయితే వంగవీటి రాధా మాత్రం తమ సామాజికవర్గానికి ఇక్కడ అన్యాయం జరుగుతుండటంతో తాను ఇక్కడకు వచ్చానని చెబుతున్నారు.కానీ వంగవీటి రాధాను వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. వంగవీటి రాధా అయితే ఇటు కాపు సామాజికవర్గం ఓట్లతో పాటు అటు కమ్మ సామాజికవర్గం ఓట్లు కూడా పడతాయని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే వంగవీటి రాధా గుడివాడలో ఎక్కువగా పర్యటిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఇద్దరు స్నేహితుల మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటల్లేవని కూడా వారి సన్నిహితులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా వంగవీటి రాధా చేస్తున్న రాజకీయ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. మరి ఇప్పుడో?