అనంతపురం, సెప్టెంబర్ 24,
హిందూపురం నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం మూడేళ్ల ముందు నుంచే హిందూపురంను జగన్ టార్గెట్ చేశారు. ఏ పదవులు వచ్చినా జగన్ హిందూపురం నియోజకవర్గాన్ని మాత్రం విస్మరించడం లేదు. హిందూపురం కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. అక్కడ రెండు దఫాలుగా నందమూరి బాలకృష్ణ గెలుస్తూ వస్తున్నారు.గత ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు జగన్ అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఆయనపై రిటైర్డ్ పోలీస్ అధికారి ఇక్బాల్ అహ్మద్ ను పోటీ చేశారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అబ్దుల్ ఘనిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు బాలకృష్ణ కే విజయం దక్కింది. హిందూపురంలో వైసీపీలో ఉన్న గ్రూపు విభేదాలే ఓటమికి కారణమని ఆ తర్వాత విశ్లేషణలు వెలువడ్డాయి.ఇక హిందూపురం నియోజకవర్గంలో ఓటమి పాలయిన ఇక్బాల్ కు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన వచ్చే ఎన్నికల వరకూ కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ఇక హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ మరో ముఖ్యనేత నవీన్ నిశ్చల్ గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా చివరి నిమిషంలో ఇక్బాల్ కు కేటాయించారు.దీంతో గత కొంత కాలంగా హిందూపురం నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు హెచ్చుమీరిపోయాయి. ఈ రెండు గ్రూపులతో పాటు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సయితం మరో గ్రూపును తయారు చేశారు. ఇక్కడ వైసీపీ గ్రూపు విభేదాలతో ఉండటం బాలకృష్ణకు కలసి వచ్చింది. ఇది గమనించిన వైసీపీ అధిష్టానం నవీన్ నిశ్చల్ కు నామినేటెడ్ పదవి ఇచ్చింది. ఆగ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నవీన్ నిశ్చల్ ను నియమించింది. ఇప్పుడు వైసీపీలోని ఇద్దరు నేతలు పదవులు పొందారు. ఇప్పటికైనా హిందూపురంలో అన్ని వర్గాలు కలసి పార్టీని పటిష్టం చేస్తారా? లేక పదవులు దక్కడంతో విభేదాలు మరింతగా పెరుగుతాయా? అన్నది చూడాల్సి ఉంది.