YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నవరత్నాల కోసం అప్పులు

నవరత్నాల కోసం అప్పులు

విజయవాడ, సెప్టెంబర్ 24, 
ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం ప్రపంచబ్యాంక్‌ తలుపులు తడుతోంది. ప్రపంచ బ్యాంక్‌ అప్పంటే షరతులు ఉంటాయని, ప్రజలపై భారాలు మోపాల్సి ఉంటుందని తెలిసినా రాష్ట్రప్రభుత్వం మాత్రం ప్రపంచ బ్యాంక్‌ రుణాలు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే వివిధ మార్గాల్లో 50 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది. పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమీకరణ ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతో ఆదాయాలను పెంచుకునే మార్గాలను వెతుక్కుంటూనే ప్రధానంగా అప్పులపైనే అధికంగా ఆధారపడింది. ఇసుక, మద్యం ద్వారా కొంత మేరకు ఆదాయాలు వస్తున్నప్పటికీ... ఇప్పటికే ఉన్న ఆర్ధిక మాంధ్య పరిస్థితులకుతోడు కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఆదాయాన్ని పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. పరిమితికి మించి అప్పులు చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వంపై కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్‌, ఎడిబి, ఎఐఐబి రుణాలపూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులకు ఇన్‌పుట్‌లను, యంత్రాలను అందుబాటులోకి తెస్తానంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూసమగ్ర సర్వే చేపడుతోంది. రైతులకు నగదు బదిలీ చేస్తోంది. వ్యవసాయరంగంలో చేస్తున్న ఈ పనులను చూపించి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ నుంచి రుణం పొందాలని చూస్తోంది. అలాగే విద్యా రంగంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్‌ నుండి రూ.1875 కోట్ల రూపాయాల రుణాన్ని ఇప్పటికే తీసుకుంది. దీని వల్ల అంగన్‌ వాడీ సెంటర్లు ఆస్థిత్వాన్ని కోల్పొతున్నాయి. నిరుద్యోగులకు కొత్తగా టీచర్‌ పోస్టులు దొరికే పరిస్థితి ఉండదు. స్కూళ్ల విభజన కారణంగా దూరం పెరిగి చాలామంది బలహీనవర్గాలకు చెందిన పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది. అయినా ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తోంది. కేంద్రం ఒత్తిడితోపాటు ప్రపంచ బ్యాంక్‌ రుణానికి ఆశపడి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా రంగంలో మార్పులు తేస్తున్నామని చెప్పి విద్యా రంగంలో మరిన్ని రుణాలను ప్రపంచ బ్యాంక్‌ నుంచి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తీసుకోబోతోంది. వైద్య రంగంలోనూ మౌలిక వసతుల అభివృద్ది కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయబోతున్నామని, దాని కోసం రుణాలను ఇవ్వాలని కూడా ప్రపంచ బ్యాంక్‌ను కోరుతోంది. వైద్య రంగంలో ప్రతి గ్రామంలోనూ ఒక క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయలను అంటే ఆపరేషన్‌ గదులను, వ్యాధి నిర్ధారణ పరీక్షల యంత్రాలను నెలకొల్పబోతున్నారు. ఇటీవల కొత్తగా వైద్య కళాశాలల ఏర్పాటు చేస్తామంటూ చేసిన ప్రకటనను కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. వీటన్నింటికీ ప్రపంచ బ్యాంక్‌ నుంచి రుణం అడుగుతున్నారు.సరళీకృత ఆర్ధిక విధానాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు కావాలంటే ప్రజలపై భారాలు మోపే విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని వత్తిడి తెస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజీ పన్నును ప్రవేశపెట్టింది. విద్యుత్‌ రంగంలోనూ సంస్కరణలు అమలు చేస్తూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగిస్తున్నారు. ఇవన్నీ కూడా నయా ఉదార విధానాల్లో భాగమే. కొత్తగా రాష్ట్ర అంశాలకు సంబంధించిన వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ రుణాలను కోరుతోంది. దీని కారణంగా వ్యవసాయ విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల అమ్మకాల్లో బహుళజాతి కంపెనీలు గ్రామస్థాయిలోకి వెళ్లే అకాశముంది. సమగ్ర భూ సర్వే పూర్తయితే వ్యవసాయ కార్పొరేటీకరణ ముమ్మరమౌతుంది.ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ నిర్దేశించే విధానాలు ప్రజలపై రకరకాల భారాలు మోపడానికి, కార్పొరేట్లకు రాష్ట్రంలోని విలువైన ప్రజల ఉమ్మడి ఆస్తులను, వనరులను కట్టబెట్టడానికి దారితీయడమే కాక బడ్జెట్‌ లోటు నియంత్రణ పేరుతో ప్రభుత్వ వ్యయం మీద ఆంక్షలు విధిస్తాయి. ఆ ఆంక్షల ప్రభావం జగన్‌ ప్రభుత్వానికి అత్యంత కీలకంగా పరిణమించిన నవరత్నాల పథకాల కొనసాగింపుని ప్రశ్నార్ధకం చేయనుందనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమౌతోంది. దానితోపాటు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, స్కీమ్‌ వర్కర్ల డిమాండ్లపై వేటుపడే ప్రమాదమూ ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్‌సి, సిపిఎస్‌ రద్దు అమలు సైతం చిక్కుల్లో పడడం ఖాయమని వారంటున్నారు. మొత్తంగా చూసినప్పుడు ప్రపంచ బ్యాంక్‌ రుణాలు పొందే ప్రయత్నం జగన్‌ ప్రభుత్వం పాలిట నిప్పుతో తల గోక్కోవడమే అవుతుందా అన్న భావన కలుగుతోంది.

Related Posts