ఏలూరు, సెప్టెంబర్ 24,
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలకు అడుగులు వేగంగా పడుతున్నాయి. బీజేపీ పొత్తులో విసిగి వేసారిన పవన్ కళ్యాణ్ తెంచుకోవడానికి పూర్తిగా డిసైడ్ అయినట్లే అంటున్నారు. ఇపుడే అయితే బాగోదు అనే ఆలోచిస్తున్నారట. పైగా సమయం సందర్భం కూడా కావాలని ఆలోచిస్తున్నారుట. పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించి ఏడేళ్ళు అయింది. ఈ ఏడేళ్లలో ఆయన బీజేపీ, టీడీపీ, వామపక్షాలు, బీఎస్పీలతో పొత్తులు పెట్టుకున్నారు. మళ్లీ 2020లో బీజేపీతో జట్టు కట్టారు. ఇప్పటికిప్పుడే బీజేపీతో పొత్తుని ఇపుడు వద్దు అనుకుంటే రాజకీయంగా తనకు నిలకడలేదని అంటారని పవన్ కళ్యాణ్ జంకుతున్నారుట. అందుకే ఎన్నికలకు ఏడాది ముందు మంచి టైమ్ చూసుకుని తలాఖ్ అనేస్తారు అని చెబుతున్నారు. జనసేన వర్గాల్లోనే ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.ఈ లోగా కూడా బీజేపీతో చేతులు కలపకుండా ఆ పార్టీతో కలసి ఆందోళనలు చేపట్టకుండా తన పనేంటో తానేంటోగా జనసేన ఉంటుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లో ఈ మధ్య కొత్త మార్పు కనిపిస్తోంది. అదేంటి అంటే ఆయన కొన్ని ఎంపిక చేసిన జిల్లాలలో పార్టీ కార్యవర్గాలను వరసబెట్టి మరీ నియమిస్తున్నారు. అలాగే నియోజకవర్గాలకు కూడా కమిటీలు వేస్తున్నారు. వారిని అక్కడ పనిచేసుకోమని కూడా చెబుతున్నారు. ఇలా ఏపీలో ముప్పయి నుంచి నలభై నియోజకవర్గాలను జనసేన ఇప్పటికే గుర్తించిందని అంటున్నారు. వీటిలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అంటున్నారు.అంటే టీడీపీతో పొత్తు కచ్చితంగా ఉంటుందని జనసేన భావిస్తోంది. అందులో భాగంగా ఈ సీట్లు డిమాండ్ చేసి తీసుకోవాలని ముందే స్కెచ్ గీసుకుంటున్నారు అన్న మాట. పవన్ కళ్యాణ్ అభిమానులు, కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువుగా ఉన్న చోటే జనసేన సీట్లు తీసుకుని పోటీ చేస్తుందని అంటున్నారు. ఈ సీట్లలో ఎక్కువగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలే ఉంటాయని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే లాభమేంటి అంటే ఆయన పార్టీ కనీసం పాతిక సీట్లు గెలిచినా రాజకీయంగా హవా చలాయించవచ్చు అన్నది ఉద్దేశ్యంగా ఉందిట.రేపటి రోజున టీడీపీ తరఫున ముఖ్యమంత్రి అయినా జనసేనకు కూడా పొత్తులో భాగంగా పదవులు ఉంటాయట. అలాగే పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి కీలకమైన మంత్రిత్వ శాఖలు లభించవచ్చు అని కూడా అంటున్నారు. ఇక టీడీపీతో 2024లో పొత్తు పెట్టుకుని అయిదేళ్ల పాటు తమ బలాన్ని పెంచుకుంటే ఆ తర్వాత సొంతంగా ఎదిగే ఛాన్స్ ఉంటుందని పవన్ కళ్యాణ్, జనసేన వర్గాలు లెక్కలు వేసుకుంటోన్న పరిస్థితి అయితే ఆ పార్టీలో కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే వచ్చే ఎన్నికలలో మాత్రం జనసేన తన ప్రతాపాన్ని చూపిస్తుంది అంటున్నారు. ఏదేమైనా జనసేన వైసీపీని ఓడించడమే లక్ష్యంగా చేసుకుని టీడీపీతో పొత్తుకు ఫిక్స్ అవుతోన్న ముందస్తు వాతావరణమే ఏపీలో ఉంది.