బెంగళూర్, సెప్టెంబర్ 24,
కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ లో ఆశలు పెరిగాయి. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు కలసికట్టుగా ముందుకు సాగుతున్నారు. బీజేపీ తనంతట తానే సెల్ఫ్ గోల్ వేసుకుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే కాంగ్రెస్ నేతలు వ్యూహాలకు తెరలేపారు.కర్ణాటకలో కాంగ్రెస్ పట్టు ఇంకా తగ్గలేదు. గత ఎన్నికల్లోనూ రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి జేడీఎస్ సాయంతో అధికారంలోకి రాగలిగింది. కానీ స్వయంకృతాపరాధంతో కాంగ్రెస్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీ పరిస్థిితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మోదీ ఇమేజ్ పడిపోవడం, యడ్యూరప్పను పదవి నుంచి దించేయడంతో కాంగ్రెస్ ఇక అధికారం తమదేనన్న ధీమాలో ఉంది.కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన బసవరాజు బొమ్మై అసంతృప్తులతో సతమతమవుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతోంది. విభేదాలకు స్వస్తి చెప్పి ఇటు సిద్ధరామయ్య, అటు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వర్గాలు ఏకమై అధికార పార్టీ పై ధ్వజమెత్తుతున్నారు. జేడీఎస్ సయితం అధికార పార్టీపై పెద్దగా పోరాటం చేయకపోవడం తమకు కలసి వచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తుంది.ఇక త్వరలో జరగనున్న ఉప ఎన్నికలను ఎలాగైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. త్వరలో హనేగల్, సిందగీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో తమకు అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ ఆశిస్తుంది. బీజేపీలో ఉన్న విభేదాలు తమకు విజయం చేకూరుస్తాయన్న ఆశతో ఉంది. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్ ఈసారి పాగా వేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.