వరంగల్, సెప్టెంబర్ 24,
రాజకీయ సవాళ్లతో టీఆర్ఎస్ అధిష్ఠానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం మరో చాలెంజ్ విసిరేందుకు సిద్ధమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాంట్రాక్టు సంస్థలు నిర్వహించిన అభివృద్ధి పనుల్లో జరిగిన అక్రమాలను బయటపెట్టడమే లక్ష్యంగా టెండర్ చాలెంజ్‌కు పిలుపునివ్వబోతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో గడిచిన ఏడున్నరేళ్ల కాలంలో చేపట్టిన పనులు, సొంత కాంట్రాక్టు సంస్థలకు టెండర్లు దక్కేలా చక్రం తిప్పిన వైనాలను, నాణ్యతలేమిగా సాగిన పనులపై ఇప్పటికే గ్రౌండ్ వర్క్స్ చేయడం గమనార్హం.ఆయా పనులకు సంబంధించిన టెండర్ల వివరాలు, అంచనా వ్యయాలను పెంచుకున్న విధానంపై నివేదికలతో సహం రెడీగా ఉన్నట్లు ముఖ్య నేతల ద్వారా తెలుస్తోంది. ఈ టెండర్ చాలెంజ్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లానే వేదిక కానుండటం గమనార్హం. టెండర్ చాలెంజ్ సెగ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి, ఆ తర్వాత వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు తగలనున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఓ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న నేత నిర్ధారించారు.పనులు దక్కించుకోవడంలో కుమ్మక్కు, టెండర్ పనులను తక్కువకు కోట్ చేసి కైవసం చేసుకుని.. ఆ తర్వాత పనులను పెండింగ్‌లో పెట్టి అంచనా వ్యయాలను పెంచుకుని నాణ్యత లేమితో నిర్మించి వదిలేసిన వైనాన్ని బహిర్గతం చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. అభివృద్ధి పనుల మాటున ఒక్కో ఎమ్మెల్యే వేలాది కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారన్ని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు గడిచిన ఏడున్నరేళ్ల కాలంలో సొంత కాంట్రాక్టు సంస్థలకు దక్కించుకున్న వేల కోట్ల పనులను బహిర్గతం చేసి అవినీతి, అక్రమాలను, నాణ్యతలేమిని ఎండగడుతామని చెబుతున్నారు. కాంట్రాక్టర్లే ప్రజాప్రతినిధులే కావడంతో వారి ధన దాహం తీరడం లేదని, ప్రజాసొమ్మును కాజేయడమే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర స్థాయి నేత వ్యాఖ్యనించడం గమనార్హం.వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాకా తన సొంత సంస్థకు రూ.2వేల కోట్ల పనులు దక్కించుకున్నాడని, ఇందులో చాలా వరకు పెండింగ్ పెట్టి అంచనా వ్యయాలను పెంచుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇక సబ్ కాంట్రాక్ట్‌ల పేరుతోనూ దోపిడీ సాగుతోందన్న ఆరోపణలు చేస్తున్నారు.ఎమ్మెల్యేలు చేస్తున్న సొంత కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో నాణ్యత ఉండకపోవడం, అవినీతి, అక్రమాలపై ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. విజిలెన్స్ శాఖకు చేసిన ఫిర్యాదులు సైతం బుట్టదాఖలవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లుగా కాంగ్రెస్ నేతలు పేర్కొంటుండటం గమనార్హం.