సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించడాన్ని కాంగ్రెస్ పార్టీ సవాలు చేసిన విషయం తెలిసిందే. అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలిస్తామని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే కొద్ది గంటల్లోనే... ఈ పిటిషన్ విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన మరో ధర్మాసనాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేయడం విశేషం. కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ ప్రత్యేక ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. సీనియార్టీ ప్రాతిపదికన ఆరోస్థానంలో ఉన్న జస్టిస్ ఎ.కె.సిక్రి ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తారు.న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.బాబ్డె, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎ.కె.గోయెల్ ఇందులో సభ్యులుగా ఉంటారు. మంగళవారం నాటి కార్యకలాపాల జాబితాలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటును కూడా ప్రస్తావించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలిని తప్పుబడుతూ జనవరి 12న మీడియా సమావేశం నిర్వహించిన అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎం.బి.లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లను ఈ అంశానికి దూరంగా ఉంచారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలని కోరుతూ 7 పార్టీలకు చెందిన 60 మంది ఎంపీల సంతకాలు చేసిన నోటీసును గత నెలలో రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించారు. ధర్మాసనాల ఏర్పాటు, కేసుల కేటాయింపులు, రోస్టర్ విధానం తదితర అంశాల్లో సీజేఐ దీపక్ మిశ్రా తీరును నిరసిస్తూ తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. దీంతో సీజేఐపై అభిశంసన తీర్మానం పెట్టడానికి కాంగ్రెస్ సమయాత్తమవుతోంది. అయితే ఆ పార్టీ ప్రయత్నాలకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య ఆదిలోనే గండికొట్టడంతో సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించింది.