2021లో కులగణన–వెనకబడిన వర్గాలను చేర్చొద్దు
సుప్రీంకోర్టును కోరిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ సెప్టెంబర్ 24
కులగణన–2021లో వెనకబడిన వర్గాలను చేర్చొద్దని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఓబీసీల వివరాల్లో కచి్చతత్వం లేదని తెలిపింది. 2021 కులగణనలో ఎస్సీ, ఎస్టీల లెక్కలను మాత్రమే సేకరించి, ఇతర కులాలను మినహాయించాలనేది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయమని తెలిపింది. రాష్ట్రంలో ఓబీసీల కులగణన కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పరిగణనలోకి తీసుకోవద్దంటూ కేంద్ర సామాజిక సాధికారత శాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ మేరకు పేర్కొంది. జనవరి 7, 2020న జారీ చేసిన నోటిఫికేషన్‌లో 2021 కులగణనకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలను మాత్రమే చేర్చామని కేంద్రం తెలిపింది.
2021 కులగణనలో గ్రామీణ భారతంలోని వెనకబడిన వర్గాల సామాజిక–ఆర్థిక డాటాను పొందుపరచాలని సెన్సస్ విభాగానికి ఆదేశాలు ఇవ్వొద్దని, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 8లో పొందుపరిచిన విధాన నిర్ణయంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొంది. ఓబీసీల కులగణన చేపట్టడానికి రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్‌కు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ఆదేశాలు లేవని తెలిపింది. కులగణనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులను హైకోర్టులు, సుప్రీంకోర్టు గతంలో కొట్టివేశాయని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం వద్ద ఉన్న మహారాష్ట్రలోని ఓబీసీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.