ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష, జరిమానాలు నిలుపుదల
అమరావతి సెప్టెంబర్ 24
పలువురు ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం నిలుపుదల చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు జిల్లాలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌కు భూమి కేటాయించేందుకు వెంకటాచలం మండలం ఎర్రగుంటకు చెందిన తాళ్లపాక సావిత్రమ్మకు చెందిన మూడెకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సావిత్రమ్మకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. పరిహారం ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. కోర్టు ధిక్కార కేసులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్‌కు నెల జైలు, రూ.2 వేల జరిమానా, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా, అప్పటి మరో కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్ ఎన్‌వీ చక్రధర్‌లకు రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.