గుంటూరు, సెప్టెంబర్ 25,
రాజకీయాల్లో రాణించాలంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. ఒకసారి ఓడినా మరోసారి గెలిస్తేనే నియోజకవర్గంలో పట్టు సడలి పోకుండా ఉంటుంది. కానీ పదేళ్లు గ్యాప్ వస్తే.. ప్రత్యర్థులు గట్టి వారయితే.. మరోసారి చేతులు కాల్చుకునే కంటే నియోజకవర్గాన్నే మార్చేయడం బెటర్. ఇప్పుడు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. తనను ఆదరించిన ప్రజలకు దూరమవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు.తెనాలి నియోజకవర్గంలో ఈసారి పోటీ చేయాలా? మరో నియోజకవర్గాన్ని ఎంచుకోవాలన్న దానిపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఆలోచనలో పడ్డారు. తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ రెండుసార్లు విజయం సాధించారు. 2004లో గోగినేని ఉమ, 2009 ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లపై ఆయన విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత నాదెండ్ల మనోహర్ వైసీపీలో చేరతారనుకున్నా జనసేనలో చేరారు.మొన్నటి ఎన్నికలలోనూ నాదెండ్ల మనోహర్ దారుణ ఓటమిని చవి చూశారు. జగన్ వేవ్ అనుకున్నప్పటికీ మరోసారి తెనాలి నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ స్ట్రాంగ్ అయింది. ప్రస్తుత ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. మరోవైపు ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీని తెనాలిలో బలోపేతం చేస్తున్నారు. క్యాడర్ కు అందుబాటులో ఉంటున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాదెండ్ల మనోహర్ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తాను తెనాలిలో పోటీ చేస్తానంటున్నారు. ఆయన కనుక బరిలో ఉంటే తాను మరొక నియోజకవర్గానికి ఛేంజ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు జిల్లాలోనే జనసేన బలంగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నాదెండ్ల మనోహర్ భావిస్తున్నారు.