హైదరాబాద్, సెప్టెంబర్ 25,
కాంగ్రెస్ నేతలకు పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ వ్యవహార శైలి మింగుడు పడటం లేదు. ఆయన వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ లో అనేక మంది నేతలు అసంతృప్తికి గురవుతూ వస్తున్నారు. సుదీర్ఘకాలం నుంచి పార్టీని నమ్ముకున్న తమను కాదని రేవంత్ రెడ్డిని తెచ్చి పీసీసీ చీఫ్ గా నియమించడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండి పడుతున్నారు. మాణికం ఠాకూర్ ను వదిలంచుకుంటే తప్ప తమకు పార్టీలో అవకాశాలు దక్కవని వారు భావిస్తున్నారు.మాణికం ఠాకూర్ రాష్ట్ర ఇన్ ఛార్జిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టారు. ప్రజాక్షేత్రంలో బలం లేని నేతల మాటలకు, సూచనలకు ఆయన తొలినుంచి విలువ ఇవ్వడం లేదు. కొందరు సీనియర్ నేతలు పార్టీకి భారంగా మారారనే మాణికం ఠాకూర్ భావించారు. అందుకే వి.హనుమంతరావు లాంటి సీనియర్ నేతలను ఆయన లైట్ గా తీసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి నియామకంలో మాణికం ఠాకూర్ పాత్ర ఎక్కువగా ఉంది.అధినాయకత్వానికి నివేదికలు ఇవ్వడమే కాకుండా, రేవంత్ అయితేనే పార్టీ బలోపేతం అవుతుందని సూచించారు. దీంతో సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నా అగ్రనాయకత్వం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టింది. ఇక రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వచ్చిన తర్వాత దూకుడు పెంచారు. పార్టీ కార్యక్రమాలను నిత్యం జరుపుతున్నారు. దీని వెనక మాణికం ఠాకూర్ ఆలోచనలు కూడా ఉన్నాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డిని వెనకేసుకు రావడంలో కూడా మాణికం ఠాకూర్ వెనకాడటం లేదు.శశిధరూర్ విషయంలో రేవంత్ రెడ్డిని ఏమీ అనకుండా ఈ వీడియోను కేటీఆర్ కు పంపిన జర్నలిస్టు పైనే మాణికం ఠాకూర్ మండిపడ్డారు. సుపారీ జర్నలిస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా తప్పుపడుతున్నారు. రేవంత్ రెడ్డి సీనియర్ నేత శశిథరూర్ పై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టకుండా జర్నలిస్ట్ ను తూలనాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు దీనిని తప్పుపడుతున్నారు. మాణికం ఠాకూర్ పై ఫిర్యాదు చేసేందుకు కొందరు నేతలు రెడీ అవుతున్నారు.