YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఖమ్మంలో గులాబీ ముళ్లు

ఖమ్మంలో గులాబీ ముళ్లు

ఖమ్మం, సెప్టెంబర్ 25, 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి అధికార పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శుల పదవుల్లో మొండిచేయి చూపడంతో సొంత పార్టీలో దళిత క్యాడర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ ఐదు మండలాల అధ్యక్ష కార్యదర్శి పదవులు ఓసీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు కట్టబెట్టడం ఎస్సీ కార్యకర్తల అసహనానికి కారణమయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతికి పెద్దపీట వేశామని టీఆర్ఎస్ పార్టీ చెబుతుండగా, అశ్వారావుపేట నియోజకవర్గంలో అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని దళిత వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గులాబీ పార్టీలో ఎస్సీలను కేవలం పార్టీ జెండాలు మోసే, బ్యానర్లు కట్టే కార్యకర్తల్లాగా చూస్తున్నారే తప్పా నాయకునిగా గుర్తించడం లేదని కొందరి నుంచి ఆవేదన వ్యక్తమవుతుంది. పార్టీ కోసం కష్టపడే అట్టడుగు శ్రామికులకు పట్టించుకోకుండా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే పర్యటనల్లో హడావిడి చేసి మాయమయ్యే అగ్రవర్ణాల్లోని శ్రీమంతులకు పట్టం కట్టడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా కొనసాగనిస్తారు తప్పా, పార్టీ పరంగా నాయకులుగా ఎదిగేందుకు అవకాశాలు ఉండట్లేదని, దళితులకు పార్టీలో సముచిత న్యాయం కొరవడిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.సరైన గుర్తింపు లేకపోవడంతో రాజకీయంగా కూడా వెనుకబడి పోయామని, నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ఎస్సీలను పక్కన పెట్టడం వల్ల పార్టీకే నష్టమని, మండల అధ్యక్ష కార్యదర్శుల నియామకంలో అధిష్టానం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం దళిత బంధు అమలు చేస్తున్నట్టే, నియోజకవర్గంలోని ఎస్సీ కార్యకర్తలకు గుర్తింపు నిచ్చేందుకు దళిత బాంధవుల్లా నాయకులు, అధిష్టానం మారాలని డిమాండ్లు కూడా స్థానికంగా పుట్టుకొస్తున్నాయి. పార్టీలో ఎస్సీల పాత్ర, అధిష్టానం ఇస్తున్న ప్రాధాన్యం గురించి స్థానిక ఎస్సీ కార్యకర్తలు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిఘటించకపోతే తమ ఉనికి కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నట్లు వారు భావిస్తున్నట్లు సమాచారం.అయితే, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎస్టీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎస్టీ సామాజికవర్గానికి కూడా పదవి దక్కకపోవడం కూడా ఇక్కడ గమనార్హం.

Related Posts