YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

కొలువులు ..మాయం

కొలువులు ..మాయం

హైదరాబాద్, సెప్టెంబర్ 25, 
కన్నవాళ్ల కష్టాలు తీర్చాలని కష్టపడి చదువుకున్న యువత ప్రభుత్వ కొలువుల నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. రాష్ట్ర సర్కార్ ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినా రెడీగా ఉండేందుకు  స్టడీ హాళ్లలో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో తెలియక... ఒక వేళ ఇచ్చినా పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థంకాక  నిరుద్యోగులు సతమతమవుతున్నారు. హైదరాబాద్ లో అశోక్ నగర్, కూకట్ పల్లి, అమీర్ పేట్, నారాయణగూడ, దిల్సుఖ్ నగర్ ఇలా చాలా ప్రాంతాల్లో నిత్యం నిరుద్యోగులు ఏదో ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ కోసం కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్ లో చదువుకుంటూ కనిపిస్తారు. కాలేజీలు, యూనివర్సిటీ లైబ్రరీల్లోనూ చాలామంది ఉంటారు. ఒక్క అశోక్ నగర్ లోనే 100కు పైగా స్టడీ హాళ్లు ఉన్నాయి.  సిటీ మొత్తంలో 5 వేలకు పైగా ఉంటాయని అంచనా. లక్షల మంది నిరుద్యోగులు ఈ స్టడీ హాళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. PRC నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షా 90 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ వచ్చి ఏడేళ్ళయినా గ్రూప్స్ 1 కొలువుల భర్తీకి నోటిఫికేషన్ రాలేదు.  గ్రూప్ 2 వాయిదాల మీద వాయిదాలు పడుతూ... నోటిఫికేషన్ వచ్చిన ఐదేళ్ళ తర్వాత కొలువులు భర్తీ అయ్యాయి. ఒక్క పొలీసు శాఖలోనే కాస్తో కూస్తో నోటిఫికేషన్లు వచ్చాయి తప్ప... మిగతా ఖాళీలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటున్నారు నిరుద్యోగులు. ఎన్నికల సమయంలో మాత్రమే కొలువుల నోటిఫికేషన్లపై సర్కార్ ప్రకటనలు చేస్తోందనీ... తమ ఓటింగ్ 10 నుంచి 15శాతమే ఉండటంతో చిన్నచూపు చూస్తోందని అంటున్నారు నిరుద్యోగులు.  గ్రామీణులు, రైతులు, ఉద్యోగ సంఘాలు ఓట్లేస్తే చాలు అనే భావనలో రాష్ట్ర సర్కార్ ఉందని విమర్శిస్తున్నారు. కొవిడ్ సంక్షోభం తర్వాత హైదరాబాద్ లో మూత పడ్డ కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలియకున్నా చాలామంది కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయి ప్రిపేర్ అవుతున్నారు.  ఇలా కోచింగ్ తీసుకుంటున్న ఒక్కొక్కరికి ప్రతినెలా కనీసం 6 వేల నుంచి 9 వేల దాకా ఖర్చవుతున్నట్టు చెబుతున్నారు. పీఆర్సీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో లక్షా 90 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అధికారులు మాత్రం శాఖల వారీగా 67 వేలే ఉన్నట్టు గుర్తించారు.  అయినా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ముందుకుసాగడంలేదు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయితే ఖాళీలు భర్తీ చేస్తామంటున్నారు.  ప్రత్యేక రాష్ట్రం వస్తే మన కొలువులు మనకే వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులు ... సొంత రాష్ట్రంలో నిరాశగా ఉన్నారు. ఉద్యోగాలు రావనే బాధతో ఎందరో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా యువత బలవన్మరణాలకు పాల్పడకుండా ఉండాలంటే ప్రభుత్వం స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నాగార్జునసాగర్ బైఎలక్షన్,  ఎమ్మెల్సీ ఎన్నికల సమయాల్లో త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పినా అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్ర అసహనంగా ఉన్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగాల భర్తీ చేస్తామని ఓట్లు దండుకోవడం తప్ప టీఆర్ఎస్ సర్కార్  చేసిందేమీ లేదంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులనే ఎక్కువగా భర్తీ చేసింది. ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులను పట్టించుకోలేదు. కొలువల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టుకుంటూ స్టడీహాల్స్ , కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు మాత్రం  నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

Related Posts