ఫిబ్రవరి 1న పార్లమెంటులో వార్షిక బడ్జెట్ సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాయత్తమవుతున్నారు. బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దడంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్...విత్త మంత్రికి ఓ సలహా ఇచ్చారు. జైట్లీ ద్రవ్య లోటు పెరగకుండా చూస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో అధికరం కొందరి దగ్గరే కేంద్రీకరణ కావడం సరైన పరిణామం కాదన్నారు.
ఆధార్‌ను తప్పనిసరి చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధార్ వివరాలు సురక్షితంగా ఉందన్న భరోసాను ప్రజల్లో కల్పించాలన్నారు. ఆధార్ గోప్యతకు సంబంధించిన హామీలు ఉల్లంఘనకు గురికావడం కాస్త ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. ఆధార్‌ను ఎక్కడ వాడాలో? ఎక్కడ వాడకూడదో? ఓ సంస్థాగత వ్యవస్థ ఉండాలన్నారు.