YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీలో నిర్మల్ ప్రకంపనలు

బీజేపీలో నిర్మల్ ప్రకంపనలు

అదిలాబాద్, సెప్టెంబర్ 27, 
ర్మల్‌లో అట్టహాసంగా అమిత్‌ షా సభ నిర్వహించిన కమలనాథులు.. బొమ్మలాట పంచాయితీకి దిగారా? ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం ఈ అంశమే బీజేపీ నేతలకు తలనొప్పి తెచ్చిపెడుతోందా? పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ జోక్యం చేసుకున్నా సెగలు అలాగే ఉన్నాయా?ఈ ఏడాది తెలంగాణలో బీజేపీ నిర్వహించిన విమోచన దినోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌ వేదికైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రావడంతో నేతలు తమ శక్తిమేరా జనసమీకరణ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. సభ ముగిసిన తర్వాత వస్తున్న ఆఫ్టర్‌ షాక్స్‌ కమలనాథులకు కునుకు లేకుండా చేస్తున్నాయట. షా టూర్‌ను ఉపయోగించుకుని జనాల్లోకి వెళ్లాలని ప్రణాళికలు వేసుకుంటున్న నేతలకు.. కొత్త పంచాయితీలు ముందరి కాళ్లకు బంధాలేస్తున్నట్టు సమాచారం. దానిపైనే ఇప్పుడు పార్టీలో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోందట.ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల కాలంలో బీజేపీలో చేరికలు పెరిగాయి. మరికొందరు కాషాయ కండువా కప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇంతలో అమిత్ షా సభ ఏర్పాటు చేయడంతో.. పార్టీలో ఉన్నవారితోపాటు.. బీజేపీలో చేరేవాళ్లు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు.. బ్యానర్లు ఏర్పాటు చేశారు. నిర్మల్‌తోపాటు ఆదిలాబాద్‌లో రహదారులపై ఎటు చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లే కనిపించాయి. ఈ రెండో కేటగిరికి చెందిన వాళ్లు పెట్టిన ఫ్లెక్సీలే ఇప్పుడు గొడవకు దారితీశాయి. పార్టీ నేతలు వాటిని పీకి పడేశారు.బీజేపీలో ఇంకా చేరని ఓ పారిశ్రామిక వేత్త..ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున కట్టించారు. ఆ ఫ్లెక్సీలలో అమిత్ షా, ఎంపీ సోయం బాపురావ్‌ ఫొటోలే ఉన్నాయట. ఎక్కడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడి ఫొటోలు లేవట. ఇది తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అనుచరులు వాటిని పీకేశారు. దీంతో సమస్య పెద్దదై బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ దగ్గరకు వెళ్లిందట. ఆయన పాయల్‌కు క్లాస్‌ తీసుకున్నారని ఒకరు.. లేదు బుజ్జగించారని మరొకరు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అమిత్ షా సభకు ముందు రోజు జరిగిన ఈ గొడవ ఇప్పటికీ పార్టీలో సెగ రేపుతోందట.పార్టీపై అభిమానంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ నేతలే ఎలా తీసేస్తారు? అందులోనూ అమిత్ షా బొమ్మలు ఉన్న ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారు అని పార్టీలో మరో వర్గం ప్రశ్నిస్తోందట. ఈ విషయంలో అంతా జిల్లా అధ్యక్షుడి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నట్టు టాక్‌. దీంతో రెండు వర్గాలకు సర్దిచెప్పలేక పార్టీ నేతలు తలపట్టుకుంటున్నారట. ఇదే విధంగా ముథోల్‌లో వ్యాపారాలు సాగించే ఓ నేతతో ఆ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవికి పడటం లేదట. దీంతో కొత్తగా ఎవరైనా పార్టీలోకి వస్తే కలుపుకొని పోవాల్సిన బీజేపీ నేతలే వారితో వైరం పెంచుకోవడం శ్రేణులకు అర్ధం కావడం లేదట. ఇక పార్టీలో చేరే వారి విషయంలోనూ అదే వైఖరి కొనసాగిస్తే ఎలా అన్నది మరికొందరి ప్రశ్న. అందుకే రానున్న రోజుల్లో ఈ వర్గపోరు ఎటు దారితీస్తుందో అని కాషాయ శిబిరంలో చర్చ జరుగుతోంది.

Related Posts