YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అప్పుడే 2024 చర్చ మొదలు

అప్పుడే 2024 చర్చ మొదలు

విజయవాడ, సెప్టెంబర్ 27, 
ఏపి రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైందా ? రెండున్నరేళ్ల ముందే ఎన్నికల పొత్తుల మాట తెరపైకి వస్తోందా? మాజీ మంత్రి పితాని జనసేనపై చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి? జనసేనతో ప్రయాణంపై టిడిపిలో ఉన్న మాటే ఆయన చెప్పారా? ఈ చర్చ ఎటువెళుతోంది? దీనిపై బిజెపి ఏమంటోంది?ఏపి లో ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ, 2024 లో జరిగే ఎన్నికల్లో పొత్తుల చర్చలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. ఏపిలో ప్రస్తుతానికి బిజెపి- జనసేన మిత్ర పక్షాలుగా ఉన్నాయి. 2019 ఎన్నికలు జరిగిన కొద్దినెలలకే ఈ రెండు మేం కలిసి సాగుతాం అంటూ ప్రకటన ఇచ్చాయి. తిరుపతి ఉప ఎన్నికలో కూడా కలిసి పోటీ చేశాయి. అయితే కొద్దినెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలు…ఆ తరువాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా…పరోక్షంగా టిడిపి – జనసేన కలిసి గ్రామాల్లో ఎన్నికలకు వెళ్లాయి. ఇది విధాన నిర్ణయం కాకపోయినా…పార్టీ లైన్ ను భిన్నంగా జరిగినా.. అటు టిడిపి పెద్దలు గాని….ఇటు జనసేన వర్గాలు గాని దీన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర స్థాయిలో ఎవరు ఎవరితో ఉన్నా…..గ్రామ స్థాయిలో కార్యకర్తలు, నేతల ఇష్టాలకు అనుగుణంగానే ఈ రెండు పార్టీలు ఆయా ఎన్నికల్లో నడిచాయి.ఇదిలా ఉంటే…తాజాగా మాజీ మంత్రి పితాని ఎంపిపి ఎన్నికల సందర్బంగా చేసిన వ్యాఖ్యలు అటు జనసేన…ఇటు టిడిపిలో చర్చకు కారణం అవుతున్నాయి. టిడిపి- జనసేన కలిసి పని చెయ్యడం ఆచంట నియోజవకర్గం నుంచి మొదలైందనేది పితాని కామెంట్. స్థానిక ఎంపిపి ఎన్నికల సందర్భంగా పితాని చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చలకు వేదికగా మారుతున్నాయి. బిజెపితో ప్రయాణంపై జనసేన అసంతృప్తిలో ఉంది. బిజెపితో ప్రయాణం వల్ల నష్టం తప్ప లాభం ఉండదని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు గట్టిగా నమ్ముతున్నారు.మరోవైపు జనసేన నమ్మకమైన మిత్ర పక్షం కాదని బిజెపి లోను అనుమానాలు ఉన్నాయి.పైకి రాష్ట్ర స్థాయి నేతలు కలుస్తున్నా….ఈ రెండేళ్ల కాలంలో రెండు పార్టీల కార్యకర్తలు మాత్రం కలవ లేదు. మరోవైపు పవన్ కళ్యాన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు టిడిపితో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఇదే సమయంలో టిడిపి కూడా పవన్ అండ కోరుకుంటోంది. పవన్ పై గతంలో సిఎం జగన్ చేసిన విమర్శలను నాడు టిడిపి ఖండించింది. తద్వారా పవన్ తమకు ఎప్పుడూ మిత్రుడే అని చెప్పే ప్రయత్నంలో టిడిపి మొదటి నుంచి ఉంది. ప్రభుత్వంపై విమర్శల్లో భాగంగా బిజెపి అగ్రనేతలు ప్రతి సందర్బంలో గత ప్రభుత్వ తప్పిదాలను కూడా ప్రస్తావిస్తూ వస్తుంటారు. అయితే ఈ విషయంలో పవన్ మాత్రం గత ప్రభుత్వ పనులు, వైఫల్యాలను ఎక్కడా పెద్దగా చెప్పింది కూడా లేదు. పేరుకు రాష్ట్ర స్థాయిలో బిజెపి- జనసేన మిత్ర పక్షాలుగా ఉన్నా…..కొద్దినెలలుగా టిడిపి- జనసేన మద్య గ్రామ స్థాయిలో సంబంధాలు నెలకొంటున్నాయి.జనసేనతో కలిసి వెళ్లాలని టిడిపి నేతల్లో కూడా బలంగా ఉంది. అయితే ఇప్పటికే బిజెపితో ఉన్న పవన్ బయటకు వస్తే తప్ప అది సాద్యం కాదు. బిజెపి మళ్లీ టిడిపితో కలిసే ప్రసక్తే లేదని కమలనాథులు పదే పదే చెపుతున్నారు. చంద్రబాబు ను నిత్యం తిట్టడం ద్వారా మాకు సైకిల్ పార్టీ ప్రత్యర్థే తప్ప స్నేహం ఉండదని చాటే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అటు బిజెపి తమతో కలిసి వచ్చినా రాకున్నా, పవన్ కలిసి రావాలని కోరుకుంటోంది సైకిల్ పార్టీ. టిడిపిలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల నుంచి….కింది స్థాయి క్యాడర్ వరకు…పవన్ వస్తే బాగుంటుందనే గట్టి అబిప్రాయంతో ఉన్నారట.

Related Posts