YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పథకాలు..ఓట్లు ఇస్తాయా... వైసీపీలో ఆసక్తికర చర్చ

 పథకాలు..ఓట్లు ఇస్తాయా... వైసీపీలో ఆసక్తికర చర్చ

ఒంగోలు, సెప్టెంబర్  27, 
రాజకీయ నాయకులు ఎన్ని చేసినా జనాల ఓట్లు దక్కించుకోవడమే వారి అంతిమ లక్ష్యం. ఈ విషయంలో ఎవరికీ భేషజాలు కూడా లేవు. కొందరైతే బయటకే చెప్పేస్తారు. మరి కొందరు నీట్ గా దానికి జనోద్ధరణ అని పేరు పెట్టుకుంటారు. ఇక వైసీపీ విషయానికి వస్తే లక్ష కోట్ల రూపాయలకు పైగా రెండేళ్లుగా వెదజల్లుతూ పధకాల పందేరం చేస్తున్నది కూడా అచ్చంగా ఓట్ల కోసమే. ఎవరెన్ని అనుకున్నా తాము చెప్పింది చేశాం కాబట్టి ఓట్లు వచ్చి తమ బుట్టలో పడతాయని వైసీపీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అయితే అదే పార్టీలో ఉన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీ పేరిట నేతలు మాత్రం దీని మీద పెద్ద డౌట్లే పెట్టేస్తున్నారు.ఏపీలో అభివృద్ధి లేదని విపక్షాలు రోజూ విమర్శలు చేస్తాయి. వాటిని వైసీపీ నేతలు కూడా లైట్ తీసుకుంటారు. కానీ ఇపుడు స్వపక్షంలోనే ఈ రకమైన డిమాండ్ వస్తోంది. చేసేందుకు పని లేదు, చేసినా డబ్బులు ఇచ్చే సీన్ లేదు అనుకుంటున్నారు వైసీపీలో నేతలు, వారిని ఆశ్రయించిన కాంట్రాక్టర్లు. తాజాగా విశాఖలో జరిగిన ఒక మీటింగులో కొందరు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి ముందే అభివృద్ధి పనులు ఏపీలో బాగా పెద్ద ఎత్తున చేయాలని గట్టిగా కోరారుట. ఎంతసేపూ పంచుడేనా. జనాలకు మేము కూడా ఏమీ చెప్పుకోలేకపోతున్నాం, ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక ఉత్సవ విగ్రహాల మాదిరిగానే ఉండిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పధకాలకు ఓట్లు రాలవు అంటూ వారే చెప్పడం విశేషం. జనాలు ఎపుడూ ఇచ్చిన దానిని కిమ్మనకుండా పుచ్చుకుంటారు. ఎన్నికల వేళ మాత్రం మళ్లీ చేతిలో రెండు వేల నోటు పెట్టాలి. ఇక ఆనాటికి వారికి కొత్త మోజు పుడితే వేరే పార్టీకి కూడా ఓటు వేస్తారు. అపుడు ఈ స్కీములు అన్నీ కూడా ఎవరికీ గుర్తుండవు. గాలిలో కలసిపోతాయని వైసీపీ నేతలే అంటున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు పది వేల రూపాయలను పసుపు కుంకుమ పేరిట ఇచ్చినా కూడా జనాలు ఓడించిన సంగతికి కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అందువల్ల స్కీములను తగ్గించి అయినా అభివృద్ధి చేస్తే రేపటి రోజున చెప్పుకోవడానికి ఒక మాట ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారుట.
ఇదిలా ఉంటే జగన్ సర్కార్ ఆటోడ్రైవర్లకు ఏటా పదివేల రూపాయలు ఇస్తోంది. మరి వారి మనోభావాలు ఎలా ఉన్నాయి అని ఆరా తీస్తే ఏపీలోని గతుకుల రోడ్ల మీద ఆటో నడవడంలేదు. దాంతో పదే పదే రిపేర్లు వస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కేంద్రం పెంచితే ఏపీ సర్కార్ కూడా వాటా తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో పదివేలు ఏడాదికి ఏ మూల అని అంటున్నారు. ముందు అభివృద్ధి చేసి చూపిస్తే అదే పదివేలు అన్నదే వారి మాటగా ఉంది. వారే కాదు, పంచుడు కార్యక్రమాల ద్వారా బాగా పుచ్చుకుంటున్న వారంతా కూడా రివర్స్ లోనే మాట్లాడుతున్నారుట. ఇవి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వైసీపీ నేతలు అంటూ పెద్దల ముందు ఉంచుతున్నారుట. తాము చెబుతున్నామని, కానీ పార్టీ అధినాయకత్వం వినకపోతే రేపటి రోజుల ఫలితాలు అటూ ఇటూ అయినా కోరి చేసుకున్నదే తప్ప ఎవరినీ నిందించాల్సిన పని లేదు అని సొంత పార్టీ వారే అంటున్నారు.

Related Posts