విజయవాడ
గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.తుఫాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున తక్షణ పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన అన్ని చోట్ల సహాయక శిబిరాలను తెరవాలని, ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు రూ. వెయ్యి చొప్పున, సహాయక శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టం అంచనా వేసి రైతులు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు.