గులాబ్ తుఫాను బాధితులకు 5 లక్షల సాయం
విజయవాడ, సెప్టెంబర్ 27,
గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ప్రతి అరగంటకూ పరిస్థితిని అంచనా వేయాలని, సమస్యలు తెలుసుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తుఫాను ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు సీఎం. ప్రతి అరగంటకూ విద్యుత్ పరిస్థితులపై సమాచారం తెప్పించుకోవాలన్నారు. ఇవాళ కూడా శ్రీకాకుళంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎస్‌కు సూచించారు.మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలన్నారు. బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయొద్దన్నారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నారు. మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలను తెరవాలని సూచించారు. విశాఖలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్ చేసే పనుల్ని ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఆయా కుటుంబాలకు రూ.1000 చొప్పున ఇవ్వాలన్నారు. సహాయ శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్ చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఒడిశాలో బాగా వర్షాలు కురుస్తున్నందున అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశాలున్నాయని, వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు.రిజర్వాయర్లలో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని విడుదల చేయాలని ఆదేశించారు సీఎం జగన్. మానవ తప్పిదాలు లేకుండా చూసుకోవాలన్నారు. దేవుడి దయవల్ల హుద్‌హుద్, తిత్లీ స్థాయిలో గులాబ్ తుపాను లేదని, అతిభారీ, భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు