విజయవాడ, సెప్టెంబర్ 28,
తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి వైసీపీ పై విజయం సాధించడం కన్నా ముందు నందమూరి కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడం సవాల్ గా మారిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ స్థాపించిందే నందమూరి కుటుంబం. ఆకుటుంబం చేతుల్లో నుంచి చంద్రబాబు పార్టీని తీసుకుని మూడు దశాబ్దాలుగా జెండాను ఎగరేస్తున్నారు. పార్టీ ఈ స్థాయిలో ఉందనడానికి చంద్రబాబే కారణం. దానిని ఎవరూ కాదనలేరు. కానీ చంద్రబాబు జమానా అయిపోయింది. ఆయనను పార్టీ క్యాడర్ కూడా అవుట్ డేటెడ్ నేతగానే చూస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ పార్టీలో పెరిగిపోతుంది. కాబోయే సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ప్రతి చోట టీడీపీ క్యాడర్ ప్రదర్శించడం సర్వసాధారణమయిపోయింది. చంద్రబాబు పాల్గొన్న ర్యాలీల్లోనూ, సభల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టడం, ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడం చంద్రబాబుకు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. కుప్పం నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఈ పరిస్థితి ఎదురైంది.తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ రాకను కోరుకుంటున్నారు. వారికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదు. ఎన్టీఆర్ అభిమానులంతా చంద్రబాబుకు యాంటీ అయినట్లే కన్పిస్తుంది. అలాగే టీడీపీ క్యాడర్ కూడా జూనియర్ అంటే మక్కువ చూపిస్తున్నారు. తాజాగా వినాయక చవితి ఉత్సవాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు విన్పించడం విశేషం. ఇది ఎక్కడో కాదు టీడీపీకి పట్టున్న కృష్ణా జిల్లాలోనే.కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో జరిగిన వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కన్పించాయి. కాబోయే సీఎం అంటూ క్యాడర్ నినదించింది. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కాగిత వెంకట్రావు కుటుంబానికి చెందిన ఫ్లెక్సీలు కన్పించాయి కానీ ఎక్కడా చంద్రబాబు, లోకేష్ ఫొటోలు లేకపోవడం విశేషం. రాను రాను జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న క్యాడర్ డిమాండ్ ఎక్కువవుతోంది. ఆయన రాజకీయాల్లోకి వస్తారో? రారో తెలియదు కాని రావాలన్న కోరిక మాత్రం బలంగా క్యాడర్ లో ఉంది. మరి చంద్రబాబు దీనిని ఎలా అధిగమిస్తారన్నది చూడాలి