తిరుపతి, సెప్టెంబర్ 28,
ఆర్కే రోజా.. నమ్మకమైన సమర్థవంతమైన నేత. జగన్ కు వెన్నంటి నడిచిన నేత. తన మాటల తూటాలతో విపక్షాన్ని ఇరుకున పెట్టే రోజా ఇప్పుడు తన పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. రోజాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కాదు. సొంత పార్టీ నేతలే. నగరిలో రోజా కాలు కదిపితే చాలు కయ్యానికి దిగాల్సి వస్తుంది సొంత పార్టీ నేతల మీద. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూడా రోజా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన లేదు.నగరిలో ఆర్కే రోజా రెండోసారి విజయం సాధించారు. వైసీపీ ఎమ్మెల్యేగా రోజా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ప్రజల్లో నిత్యం ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు. కేవలం నగరికే రోజా పరిమితమవ్వరు. ఎప్పటికప్పడు జగన్ మీద వచ్చే విమర్శలను తిప్పికొడుతుంటారు. అలాంటి రోజా రెండోసారి గెలిచిన నాటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి రోజాకు సొంత పార్టీలో మరింత మంది శత్రువులయ్యారు.తనకు ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్న నేతకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇవ్వడం రోజా జీర్ణించుకోలేక పోయారు. రోజా కూడా నేతలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయకపోగా వ్యక్తిగతంగా శత్రుత్వం పెంచుకోవడంతో విభేదాలు మరిత ముదిరాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయుల వల్లనే రోజా ఇబ్బంది పడుతున్నారని, వారికి మంత్రి ఆశీస్సులున్నాయని రోజా ముఖ్యమంత్రి జగన్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.ఇక తాజాగా ఎంపీపీ ఎన్నికల్లోనూ రోజుా మాట చెల్లుబాటు కాకుండా చేశారు. తన సొంత సామాజికవర్గంతోనే రోజా ఘర్షణకు దిగుతున్నారు. నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలంలో రోజా ఒకరిని ఎంపీపీగా పోటీ చేయించగా, పెద్దిరెడ్డి వర్గం మరొకరిని పోటీకి దింపింది. దీంతో మరోసారి రోజాకు, మంత్రి వర్గానికి మధ్య విభేదాలు బయటపడ్డాయి. రోజాను రెండుసార్లు గెలిపించి తాము తప్పు చేశామని సొంత పార్టీ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తం మీద రోజుాకు అధికారంలో ఉన్నప్పుటి కంటే విపక్షంలో ఉన్నప్పుడే హాయిగా ఉందట