టీడీపీ మహానాడుకు ముహూర్తం, వేదిక ఖరారయ్యింది. ఈసారి పసుపు పండుగను విజయవాడలోని కానూరు సిద్ధార్థ కాలేజీలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ ముఖ్య నేతలు కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించారు. పార్కింగ్ సౌకర్యం కూడా ఉండటంతో ఈ వేదికను ఖరారు చేశారట. ఇప్పటికే రెండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు చంద్రబాబుతో సమావేశమై మహానాడుపై చర్చించారు. కార్యక్రమ నిర్వహణ కోసం 14 కమిటీలను ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు భారీగా తరలివస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని బాబు నేతల్ని ఆదేశించారు.
వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతుండటంతో ఈసారి మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. ఏపీలో ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రత్యేక హోదా, విభజనచట్టం అమలు, రాష్ట్ర ప్రయోజనాలు, విభజన హామీల కోసం జరుగుతున్న పోరాటలపై తీర్మానాలు చేయాలని భావిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే... పార్టీ బలోపేతంతో పాటూ అక్కడి ప్రజా పోరాటాలపై తీర్మానాలను ప్రవేశపెడతారు