కర్నూలు
యూట్యూబ్లో నకిలీ నోట్ల తయారీ విధానం చూసి, వాటిని తయారు చేసి చలామణీ చేస్తున్న ముఠాను కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు. చేసిన అప్పులు తీర్చేందుకే ఈ దారిని ఎంచుకున్నట్లు నిందితులు చెప్పడం గమనార్హం. పత్తికొండ గ్రామీణ సీఐ రామకృష్ణారెడ్డి కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్, కసాపురం గ్రామాలకు చెందిన షేక్ నూర్ బాషా, ఖాజా, ఖాసీం బంధువులు. రూ.100 నకిలీ నోట్లను జొన్నగిరి గ్రామంలో దుకాణాల వద్ద మార్పిడి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారించగా వజ్రకరూర్, గుంతకల్, మద్దికెర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణీ చేసినట్లు ఒప్పుకొన్నారు. అప్పులు చెల్లించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ఓ యూట్యూబ్ చానెల్ ద్వారా నకిలీ నోట్ల తయారీ విధానాన్ని తెలుసుకున్నామన్నారు. వీరి నుంచి 27 రూ.100 నకిలీ నోట్లను, రూ.2300 అసలు నగదును స్వాధీనం చేసుకొన్నారు. నకిలీ నోట్లు తయారు చేసేందుకు ఉపయోగించిన జిరాక్స్ మిషన్, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.