YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇద్దరు నానిలకు గండం లేదట

ఇద్దరు నానిలకు గండం లేదట

ఇద్దరు నానిలకు గండం లేదట
విజయవాడ, సెప్టెంబర్ 29, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణకు సిద్దమయ్యారు. ఈ మంత్రివర్గ విస్తరణ సంక్రాంతికి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి జగన్ లెక్క ప్రకారం వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. అయితే మరో మూడు నెలల పాటు దీనిని జగన్ వాయిదా వేశారు. కొత్త ఏడాది సంక్రాంతి పండగ సమయంలో నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది.అయితే ఈసారి వంద శాతం మంత్రులను మార్చబోతున్నట్లు సంకేతాలను బయటకు పంపారు. కానీ ఇది సాధ్యం కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి మినహాయింపు ఉంటుందని పార్టీ కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. వీరిలో కీలకమైన శాఖలు, ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత ఇష్టులు కేబినెట్ లో ఉండే అవకాశముందని తెలుస్తోంది. తనకు బంధువైన బాలినేని శ్రీనివాసులురెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించినా, కొందరిని మాత్రం జగన్ కంటిన్యూ చేసే అవకాశముంది.కొడాలి నాని విషయమే తీసుకుంటే ఆ సామాజికవర్గంలో సరైన నేత వైసీపీ లో లేరు. ప్రత్యర్థి పార్టీపై విరుచుకుపడటం, జగన్ కు దన్నుగా ఉండటం వంటివి కొడాలి నానికి ప్లస్ పాయింట్. మంత్రిగా కొడాలి నాని సక్సెస్ అయ్యారా? లేదా? అన్నది పక్కన పెడితే కమ్మ సామాజికవర్గం నేతగా వైసీపీ క్యాడర్ లో నానిది ప్రత్యేక స్థానం. ఆయనను తప్పించి వేరే అదే సామాజికవర్గం నేతకు ఇవ్వాలన్నా సరైన నేత కన్పించడం లేదు.ఇక కాపు సామాజికవర్గానికి సంబంధించి కూడా ఒకరిద్దరు మంత్రులు జగన్ కేబినెట్ లో కొనసాగే అవకాశముంది. ఇందులో పేర్ని నాని వంటి వారి పేర్లు విన్పిస్తున్నాయి. పవన్ కల్యాణ్ వంటి వారి విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే పేర్ని నాని వంటి వారిని కంటిన్యూ చేయక తప్పదంటున్నారు. మొత్తం మీద జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టినా ఇద్దరు నానిలకు మాత్రం గండం లేదని పార్టీలో పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.
సేఫ్ జోన్ లో మేకపాటి
మేకపాటి గౌతం రెడ్డి వివాదాలకు దూరంగా ఉండే నేత. యువకుడు అయినా ఆయన రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జిల్లా రాజకీయాల్లోనూ ఆయనను వ్యతిరేకించే వారు తక్కువనే చెప్పాలి. మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. జగన్ చెప్పిన పనిని చెప్పినట్లు చేస్తారాయన. కీలకమైన పరిశ్రమల శాఖను చూసే మేకపాటి గౌతం రెడ్డిని వచ్చే కేబినెట్ లో కూడా కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి.మేకపాటి కుటుంబం తొలి నుంచి జగన్ కు అండగా ఉంటూ వస్తుంది. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీలో కీలకంగా మారారు. ఆయనకు 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. మేకపాటి కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇచ్చిన జగన్ తొలి కేబినెట్ లోనే మేకపాటి గౌతం రెడ్డికి స్థానం కల్పించారు. పరిశ్రమల శాఖను ఆయనకు అప్పగించారు. ఆయన చేపట్టిన రెండేళ్లలో పెద్దగా రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు.ఇప్పుడిప్పుడే ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. మేకపాటి గౌతంరెడ్డి కూడా పారిశ్రామిక వేత్త కావడంతో రానున్న కాలంలో ఆయన పరిశ్రమలను రాష్ట్రానికి తెప్పిస్తారని జగన్ అంచనా వేస్తున్నారు. మధ్యలో తప్పించి వేరే వారికి అప్పగిస్తే పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రంలో జరగదని జగన్ భావిస్తున్నారు. అందుకే జగన్ కంటిన్యూ చేసే మంత్రుల్లో మేకపాటి గౌతంరెడ్డి ఒకరన్న చర్చ పార్టీలో నడుస్తుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఎలాంటి పదవి ఇవ్వకపోవడం కూడా ఆయనను కొనసాగిస్తారన్న సంకేతాలున్నాయి.ఇక మేకపాటి గౌతంరెడ్డిని తప్పిస్తే జిల్లాలో రెడ్డి సామాజికవర్గం నేతలను కూడా సంతృప్తి పర్చడం సాధ్యం కాదు. ఇప్పటికే అనేక మంది రెడ్డి సామాజికవర్గం నేతలు నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి ఇచ్చినా మరొకరు అసంతృప్తికి గురయ్యే అవకాశముంది. ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మేకపాటి గౌతం రెడ్డి జగన్ కేబినెట్ లో కొనసాగే అవకాశాలే ఎక్కువ కన్పిస్తున్నాయి.

Related Posts