లగడపాటి మరి రాజకీయాలు
విశాఖపట్టణం, సెప్టెంబర్ 29,
లగడపాటి రాజగోపాల్ … పార్లమెంటు సభ్యుడిగా పదేళ్లు మాత్రమే ఉన్నా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ లీడర్ అయ్యారు. దీనికి కారణం ఆయన కాంట్రవర్సీయే. రాష్ట్ర విభజన సమయంలో ఆయన చేసిన హడావిడితో తెలంగాణలో విలన్ గా, ఏపీలో విలన్ గా లగడపాటి రాజగోపాల్ బాగానే ఫోకస్ అయ్యారు. అయితే మరోసారి లగడపాటి రాజగోపాల్ పేరు ఇప్పుడు ఏపీలో బలంగా విన్పిస్తుంది.లగడపాటి రాజగోపాల్ మొన్నటి ఎన్నికల వరకూ సర్వేలతో హల్ చల్ చేసేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేసిన సర్వేలు బొక్కా బోల్తాపడ్డాయి. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వస్తాడన్నారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడతాడన్నాడు. జగన్ కు ముఖ్యమంత్రిగా అయ్యే ఛాన్స్ లేదని చెప్పాడు. కానీ వీటిలో అన్నీ రివర్స్ అయ్యాయి. లగడపాటి సర్వే బూమ్ రాంగ్ కావడం, ఫలితాల తర్వాత ఇక రెండు రాష్ట్రాల్లో కన్పించకుండా పోయారు.అయితే తాజాగా తెలుగుదేశం పార్టీలో లగడపాటి రాజగోపాల్ పేరు బలంగా విన్పిస్తుంది. ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పడతో నాని వ్యతిరేకులు లగడపాటిని సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో లగడపాటి రాజగోపాల్ వ్యవహరించిన తీరుతో విజయవాడ వాసులు ఫిదా అయ్యారు. తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టారన్న సానుభూతి ఉంది.దీంతో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున లగడపాటి రాజగోపాల్ ను పోటీ చేయించాలని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమ మరి కొందరు నేతలు భావిస్తున్నారు. ఆయన పేరును తెరపైకి తెచ్చారు. నిజంగా లగడపాటి రాజగోపాల్ పోటీకి సై అంటే టీడీపీ ఖచ్చితంగా టిక్కెట్ ఇస్తుంది. లగడపాటికి వ్యక్తిగతంగా విజయవాడ ప్రాంతంలో ఓటు బ్యాంకు ఉండటమే ఇందుకు కారణం. మొత్తం మీద ఆయన పోటీ చేస్తారో? లేదో? తెలియదు కాని మరోసారి టీడీపీ వర్గాలే లగడపాటి రాజగోపాల్ పేరును బయటకు తీసుకురావడం విశేషం.