YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బద్వేలు ప్రచారానికి దూరంగా జగన్

బద్వేలు ప్రచారానికి దూరంగా జగన్

బద్వేలు ప్రచారానికి దూరంగా జగన్
కడప, సెప్టెంబర్ 29, 
బద్వేల్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. అక్టోబరు 30వ తేదీన ఎన్నిక జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధ పేరును వైఎస్ జగన్ ఖరారు చేశారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి జగన్ రెండు నెలల క్రితమే ప్రచారాన్ని ప్రారంభించారు. బద్వేలులో దాదాపు ఆరు వందల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించి వచ్చారు.అయితే జగన్ బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం లేదు. బద్వేలులో వైసీపీకి గట్టి పట్టుంది. టీడీపీ బలహీనంగా ఉంది. టీడీపీ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన ఓబులాపురం రాజశేఖర్ పేరునే ఖరారు చేసింది. దీంతో సునాయాస విజయమేనని వైసీపీ భావిస్తుంది. ఈ కారణంగానే ముఖ్యమంత్రి జగన్ బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది.ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికల్లోనూ జగన్ ప్రచారంలో పాల్గొనలేదు. కార్పొరేషన్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు జరిగినా ఆయన ప్రచారానికి దూరంగానే ఉన్నారు. తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి జగన్ వెళదామనుకున్నా కరోనా కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికలకూ జగన్ ప్రచారానికి పోలేదు. ఇదే తరహాలో బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి జగన్ దూరంగా ఉండనున్నారని తెలిసింది.బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ చివరి గెలుపు 2001 ఉప ఎన్నికలోనే. 2004 నుంచి వరసగా జరిగిన నాలుగు ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్, వైసీపీ గెలుస్తూ వస్తున్నాయి. రిజర్వడ్ నియోజకవర్గం అయిన తర్వాత టీడీపీ ఇక్కడ గెలవలేదు. దీంతో జగన్ ఈ ఉప ఎన్నికను లైట్ గానే తీసుకోనున్నారు. ప్రచారానికి దూరంగా ఉండనున్నారు. మండలాల వారీగా మంత్రులకు బాధ్యతలను త్వరలో జగన్ అప్పగించనున్నారు. భారీ మెజారిటీ రావాలని జగన్ నేతలకు లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు.
రంగంలోకి ఓబులాపురం
వాస్తవానికి  ట్రాక్ రికార్డు సరిగా లేదు. అయినా పార్టీని ట్రాక్ లో పెట్టాలంటే పోటీకి దిగాల్సిందే. బద్వేలు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి సిద్దమయింది. 2001లో తెలుగుదేశం పార్టీకి బద్వేలులో చివరి గెలుపు. అంటే ఇక్కడ గెలిచి దాదాపు ఇరవై ఏళ్లు కావస్తుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో మాదిరి ఓటు బ్యాంకును పటిష‌్టం చేసుకోవడం కోసం, ఫీడ్ బ్యాక్ ను తెలుసుకోవడం కోసం టీడీపీీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పక తప్పదు.గత ఎన్నికల్లోనే టీడీపీ దాదాపు 44 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై ఓటమిని చవిచూసింది. పైగా ఇది ఉప ఎన్నిక. అధికార పార్టీకే అడ్వాంటేజీ అని టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలుసు. అయితే గత ఎన్నికల మెజారిటీని తగ్గించాలన్నదే చంద్రబాబు ఆలోచనగా ఉంది. పార్టీ క్యాడర్ ను మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై వ్యతిరేకత పెరిగిందన్న సంకేతాలను తీసుకెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన.అందుకోసమే ముందుగానే చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన ఓబులాపురం రాజశేఖర్ పేరును ఖరారు చేశారు. తొలుత ఆయన అంగీకరించకపోయినా ఖర్చు మొత్తం పార్టీయే భరిస్తుందని హామీ ఇచ్చి ఆయనను రంగంలోకి దింపుతున్నారు. ఇటీవలే ఇక్కడ టీడీపీకి కీలకంగా ఉన్న విజయమ్మను యాక్టివ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కుమార్తె విజయమ్మ ఇక్కడ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.బిజివేముల వీరారెడ్డి కుటుంబానికి ఇక్కడ మంచి పట్టుంది. 1994, 1999లో రెండుసార్లు ఆయన టీడీపీ నుంచి విజయం సాధించారు. మరో మూడేళ్లు ఎమ్మెల్యే పదవి ఉండనుండటంతో సహజంగా ప్రజలు కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం వైసీపీ వైపు మొగ్గు చూపుతారు. అయితే రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నది బద్వేలు తీర్పు ద్వారా చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన బద్వేలు ఎన్నిక ప్రచారానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మండలాల వారీగా నేతలను నియమించనున్నారు. నేడో, రేపో కడప జిల్లా నేతలతో సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించనున్నారు.

Related Posts