రంగంలోకి కాపు సంక్షేమ సేన
విజయవాడ, సెప్టెంబర్ 29,
ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల విమర్శలపై కాపు సంక్షేమ సేన స్పందించింది. దీనికి సంబంధించి ఒక లేఖ విడుదల చేసింది. కాపు మంత్రులు పవన్‌ను తిట్టడం వెనక ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించింది. పవన్‌ను అవమానించడం అంటే.. కాపు సమాజాన్ని అవమానపరచడమేనని పేర్కొంది. 2024 ఎన్నికల్లో వీటి పర్యవసానాన్ని సీఎం జగన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య సదరు లేఖలో పేర్కొన్నారు.కాగా, ‘రిపబ్లిక్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపు ఊపేస్తున్నాయి. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. చిత్ర పరిశ్రమ, టికెట్ల పంపిణీ వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రుల తీవ్రంగా ఖండించారు. పవన్ విధానాలను తూర్పారబట్టారు. మంత్రులంతా సన్నాసులు అంటూ పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు.. మంత్రులు సైతం అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఆయన దోపిడీకి అడ్డంకిగా మారుతున్నాయి కాబట్టే అంతలా రియాక్ట్ అవుతున్నారంటూ ఫైర్ అయ్యారు.అయితే, వైసీపీ నేతలు చేస్తున్న మూకుమ్మడి కామెంట్స్‌పై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంతోపై మరోసారి విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలసీ ‘ఉగ్రవాదం’ అంటూ మండిపడ్డారు. ఈ విధానలతో రాష్ట్రంలోని అన్ని రంగాుల, వర్గాలు నాశనం అయిపోయాయని ఫైర్ అయ్యారు. ఈ ఉగ్రవాద పాలసీని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.ఇక, పవన్ వ్యాఖ్యలపై సినీనటుడు పోసాని కృష్ణ మురళి కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేసి అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నారని పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోసాని పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ స్టేట్ ఇంచార్జ్ శంకర్ గౌడ్.