క్షేత్ర ప్రచార శాఖ కార్యశాల ప్రారంభించిన మరియప్పన్
ప్రభుత్వ విభాగాలు, ప్రసార సాధనాలు సమన్వయంతో పని చేస్తూ ప్రజలను చైతన్య పరిచినప్పుడే అన్ని రకాల వ్యాధులను నియంత్రించ వచ్చునని పత్రికా, సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ మరియప్పన్ అన్నారు. మిషన్ ఇంద్రధనుష్, కుష్టు వ్యాధులపై క్షేత్ర ప్రచార శాఖ (డిఎఫ్‌పి) నిర్వహించిన కార్యశాలను ఆయన ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంద్రధనుష్ కార్యక్రమం విజయవంతమైందని, దీనివల్ల చిన్నారుల మరణాలు తగ్గాయన్నారు. మిషన్ ఇంద్రధనుష్ పై ప్రచారానికి మీడియాను,ముఖ్యంగా టెలివిజన్ ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిమాణాలపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టాలని కూడా ఆయన సూచించారు.
కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ అనూరాధ మాట్లాడుతూ.. తల్లి, శిశు మరణాలు తగ్గించడం,ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడం,కుష్టు, క్షయ వ్యాధులు, సంక్రమిత వ్యాధులను నియంత్రించేందుకు పటిష్టమైన ప్రచార వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఈ దిశలో క్షేత్ర ప్రచార విభాగం గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధులపై అవగాహనా కార్యక్రమాలను ఎంతో సమర్ధంగా నిర్వహిస్తోందని చెప్పారు. చిన్నారులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు, ఏడు రకాల వ్యాధుల నుండి వారిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందని ఆమె చెప్పారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఎమ్ఆర్ (తట్టు, రుబెల్లా) వ్యాధుల నియంత్రణకు తెలుగు రాష్ట్రాల్లో 99.2 శాతం చిన్నారులకు ఎమ్ఆర్ వాక్సిన్ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమం పరిధిలోకి ఇటీవల కొత్తగా జపనీస్ ఎన్‌సెఫెలైటీస్‌వ్యాధిని కూడా తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. తెలంగాణాలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు అందజేస్తోందని డాక్టర్ అనూరాధ చెప్పారు.
దేశంలో ప్రస్తుతం క్షయ, కుష్టు వ్యాధులు గణనీయంగా తగ్గినప్పటికీ, ఇంకా ఈ వ్యాధులను పూర్తిగా నిర్మూలించవలసిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా664 బ్లాకుల్లో క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాలను చేపట్టామన్నారు. తెలంగాణాలో ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో క్షయ వ్యాధి కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె చెప్పారు. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో క్షయ వ్యాధిపై సర్వే చేపట్టవలసిన అవసరం ఉందని డాక్టర్ అనురాధ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకురాలు శ్రీమతి సుధీర మాట్లాడుతూ - ఇంద్రధనుష్ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో మరణాలు మూడు వంతులు తగ్గించవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమం పై ఐఇసి ప్రచారం నిర్వహణలో తెలంగాణ జాతీయ స్థాయిలోనే మొదటి స్థానంలో ఉందని ఆమె చెప్పారు. ప్రసార సాధనాలు, జానపద కళారూపాలు, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ ద్వారా ఇంద్రధనుష్ పై అవగాహన కల్పించడంలో విజయం సాధించామని ఆమె చెప్పారు. తెలంగాణాలో 3 లక్షల మంది పిల్లలకు ఈ టీకాలు అందించామన్నారు.
తెలంగాణ ఆరోగ్య, వైద్య శాఖ కుష్టు వ్యాధి నిర్మూలన విభాగం జాయింట్ డైరెక్టర్ జాన్ బాబు మాట్లాడుతూ - కుష్టు రోగస్తుల పట్ల సమాజంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని,దీనిని తొలగించేందుకు ప్రసార సాధనాలు మరిన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
క్షేత్ర ప్రచార విభాగం జాయింట్ డైరెక్టర్ ఎం. దేవేంద్ర, తెలంగాణ కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.