పదినెలల కాలంలో దేశవ్యాప్తంగా వేరువేరు ప్రదేశాల్లో దాదాపు 2000 ఏటీఎంలను బ్యాంకులు మూసివేశాయని రిజర్వ్ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. ఈ మూసివేత మే 2017 నుంచి ఫిబ్రవరి 2018 మధ్యకాలంలో చోటుచేసుకుంది.
మే 2017 వరకు 1,10,116 ఏటీఎంలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి సంఖ్య ఫిబ్రవరి 2018 వచ్చే సరికి 1,07,630కు పడిపోయింది. వాటిలో స్టేట్ బ్యాంకుకు చెందిన ఆఫ్సైట్ ఏటీఎంలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మూసివేతకు ప్రధాన కారణం బ్యాంకులు నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలని భావించడమే. చాలా వరకు అన్ని బ్యాంకులు ఆన్సైట్, ఆఫ్సైట్ ఏటీఎంలను మూసివేస్తున్నాయి.కేంద్ర బ్యాంకు లెక్కల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పదినెలల కాలంలో 108 ఆన్సైట్, 100 ఆఫ్సైట్ ఏటీఎంలను మూసివేసింది. ఈ జాబితాలో కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, పీఎన్బీలు ఉన్నాయని వివరించింది. ఇప్పటివరకు బ్యాంకులు కొన్నిసార్ల వరకు ఏటీఎం లావాదేవీలను ఉచితంగా చేసుకొనే సౌలభ్యాన్ని అందించాయి. ఇప్పుడు ఆ సదుపాయాల్లో కోత విధించే అవకాశం ఉంది. దాంతో పాటు డెబిట్ కార్డు, చెక్బుక్స్ను కొంత మొత్తం వసూలు చేయనున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది .కనీస నిల్వలు ఉంచిన వినియోగదారులకు బ్యాంకులు సేవా రుసుమును మాఫీ చేస్తాయి. అయితే గత ఐదు సంవత్సరాల కాలంలో ఉచితంగా అందించిన సేవలకు సంబంధించిన మొత్తాలను చెల్లించాలంటూ జీఎస్టీ అధికారులు ఇప్పటికే కొన్ని బ్యాంకులకు నోటీసులు పంపిచారు. త్వరలో మరికొన్ని ఆ జాబితాలో చేరనున్నాయి