విజయవాడ, సెప్టెంబర్ 30,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి విజయం సాధించాలనుకుంటున్నారు. తాను చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా అవసరం అని ఆయన భావిస్తున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ టీంను రెండేళ్ల ముందుగానే రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. చివరి రెండేళ్లు ప్రభుత్వానికి, అధికార పార్టీకి కీలకం. ప్రజల మూడ్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పీకే టీం చేత సర్వేలు చేయించాలని నిర్ణయించారు. సర్వేలు కూడా కేవలం బ్రాడ్ గా కాకుండా నియోజకవర్గాల వారీగా చేయాలని జగన్ నిర్ణయించారంటున్నారు. ఐఐఐటీకి చెందిన విద్యార్థులతో పీకే టీం మరి కొద్ది నెలల్లోనే సర్వే పనులను ప్రారంభిస్తుంది. శాంపిల్స్ కూడా ప్రతి సర్వేలో ఎక్కువ సేకరించాలని జగన్ నిర్ణయించారంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలపై కూడా సర్వే చేయించాలని జగన్ నిర్ణయించారు. ప్రశాంత్ కిషోర్ టీం గత ఎన్నికల్లో మాదిరి ఈసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఇస్తుందంటున్నారు. అయితే జగన్ ఈ విషయంలో కొంత పట్టువిడుపుగా ఉంటారని చెబుతున్నారు. ఎమ్మెల్యే పనితీరు మరీ తక్కువగా ఉండి, ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా ఉన్నవారిని మాత్రం పక్కన పెట్టి, సరిచేసుకునే స్థాయిలో పనితీరు ఉంటే వారిని కంటిన్యూ చేస్తారంటున్నారు. ప్రశాంత్ కిషోర్ టీంలోని ముఖ్యమైన సభ్యుడు ఇప్పటికే విశాఖపట్నంలో పనిని ప్రారంభించారని కూడా అంటున్నారు.దీంతో పాటు గత ఎన్నికల్లో ఓటమి పాలయిన నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించనున్నారని తెలిసింది. ఇక్కడ అభ్యర్థులను గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారిని తిరిగి పోటీ చేయించాలా? లేక కొత్త నేతలను అక్కడ పోటీకి దింపాలా? అన్న దానిపై కూడా సర్వే నిర్వహించనున్నారు. జగన్ జిల్లాల పర్యటనలు ప్రారంభమయిన తర్వాత అక్కడ కూడా సర్వే లు చేయించాలని డిసైడ్ అయ్యారు. మొత్తం మీద పీకే టీం ఇప్పటికే ఏపీలో పని ప్రారంభిచిందనే అంటున్నారు.