కర్నూలు, సెప్టెంబర్ 30,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ పార్టీపై దృష్టిపెట్టినట్లే కన్పిస్తుంది. ఆయన ఇన్నాళ్లూ ప్రభుత్వం, పాలన, సంక్షేమం వంటి అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుండటంతో పార్టీని కూడా గాడిన పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లుంది. పార్టీలో నెలకొన్న విభేదాలను జగన్ ఇంతవరకూ పట్టించుకోలేదు. ఇన్ ఛార్జులకే విభేదాల పరిష్కారం బాధ్యతలను అప్పగించారు.అయితే జగన్ ఎన్నికల మూడ్ లోకి వెళ్లినట్లే కన్పిస్తుంది. వచ్చే ఏడాది ప్రశాంత్ కిషోర్ టీం కూడా రంగంలోకి దిగుతుంది. అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో ప్రభుత్వం పట్ల నెలకొన్న అభిప్రాయాన్ని పీకే టీం ద్వారా తెలుసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈలోపే తాను కొంత ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ పార్లమెంటు సభ్యులతో సమావేశమవ్వాలని నిర్ణయించారు.పార్లమెంటు సభ్యులకు, ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. గత కొంత కాలంగా అధిక శాతం మంది పార్లమెంటు సభ్యులు ఇన్ యాక్టివ్ గా ఉన్నారు. ఒంగోలు, నెల్లూరు, విశాఖ, నరసరావుపేట, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల వంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ఎంపీలకు మధ్య విభేదాలున్నాయి. నియోజకవర్గాల్లో పర్యటనలకు కూడా ఎంపీలను ఎమ్మెల్యేలు అనుమతించడం లేదు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని జగన్ నిర్ణయించారు.దీంతో పాటు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎంపీ ల్యాడ్స్ ఖర్చుపై కూడా జగన్ ఆరా తీసే అవకాశముంది. ఇక రెండున్నరేళ్లుగా జగన్ ఎంపీలతో పెద్దగా కలసింది లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు తప్ప వారి సాదకబాధకాలను తెలుసుకోలేదు. పార్లమెంటు సభ్యులు కూడా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఎంపీల సమీక్ష సమావేశం పార్టీని గాడిన పెట్టడానికేనని తెలుస్తోంది. మొత్తం మీద జగన్ సుదీర్ఘకాలం తర్వాత ఎంపీలతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.