బెంగళూ్ర్, సెప్టెంబర్ 30,
ఇంతకాలం ఇంటి నుంచే ఉద్యోగులతో పనిచేయించిన కంపెనీలు తమ ఆఫీసుల షటర్లు తెరుచుకుంటున్నాయి. ఉద్యోగులంతా తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, ఎకానమీ పుంజుకోవడం, వ్యాక్సినేషన్ ఊపందుకోవడం, రిస్ట్రిక్షన్లు కూడా ఏవీ లేవు కాబట్టి కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఆపేస్తున్నాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు ఉద్యోగులందరినీ ఆఫీసులకు రప్పిస్తున్నాయి. టాప్ మేనేజ్‌మెంట్ మెంబర్లకు, రీజనల్ హెడ్స్‌కు కూడా మినహాయింపులు ఇవ్వడం లేదు. గర్భిణులు, ఏడాదిలోపు పిల్లలు ఉన్న మహిళలు, 65 ఏళ్లు పైబడిన వాళ్లు, తీవ్రమైన జబ్బులు ఉన్న వాళ్లకు, కంటైన్‌మెంట్ జోన్లవాసులకు మాత్రం వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ రేణూ సూద్ కర్నాడ్ చెప్పారు. కోటక్ మహీంద్రా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ తమ ఉద్యోగులందరికీ టీకాలు వేయించామని, నవంబరు నాటికి వందశాతం మంది ఎంప్లాయిస్ ఆఫీసులకు వస్తారని చెప్పారు. బ్రాంచ్‌లు, కస్టమర్ కేర్ ఆఫీసుల్లో వర్క్ ఫ్రం హోంను రద్దు చేశామని అన్నారు. కొన్ని కంపెనీలు ఎంప్లాయిస్‌లను వర్క్ గ్రూపులుగా చేసి, హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం చేయాలా, ఆఫీసుకు రావాలా ? అనే విషయాన్ని వారికే వదిలేశామని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ) హెచ్‌ఆర్ హెడ్ పీఎం శ్రీనివాస్ అన్నారు. వర్క్ ఫ్రం హోం ఆపేసి ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నామని ప్రాక్టర్ & గ్యాంబుల్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, డెలాయిట్ వంటి కార్పొరేట్ కంపెనీలు ప్రకటించాయి. కొవిడ్ రూల్స్ ప్రకారం ఆఫీసులను నడిపిస్తున్నామని, పరిశుభ్రతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని ప్రకటించాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వ్యాక్సినేషన్‌ను పూర్తిచేశాయి. అయితే ఎంప్లాయిస్‌లో ఎక్కువ మంది వర్క్ ఫ్రం హోంకే మొగ్గుచూపుతున్నారు. మెజారిటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంను రద్దు చేశాయి. అయితే కరోనా థర్డ్ వేవ్ రాదని గ్యారంటీ ఏమీ లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికీ కొన్ని కంపెనీలు దైలమాలో ఉన్నాయి. ఎంప్లాయిస్‌కు పూర్తిస్థాయి భద్రత కల్పించగలమా అన్న అనుమానాలూ ఉన్నాయి. ఈ విషయమై డెలాయిట్ ఇండియా ట్యాలెంట్ ఆఫీసర్ ఎస్.వి.నాథన్ మాట్లాడుతూ ఎక్కువ మంది ఎంప్లాయిస్ హైబ్రిడ్ మోడల్‌ను ఇష్టపడుతున్నారని చెప్పారు. అవసరమైనప్పుడు ఆఫీసుకు వస్తూ మిగతా రోజుల్లో వర్క్ ఫ్రం హోం చేయడాన్ని హైబ్రిడ్ మోడల్‌గా పిలుస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఎంప్లాయిస్‌లను మాత్రమే ఆఫీసుకు రమ్మన్నామని, మిగతా వారికి అక్టోబరు 31 దాకా వర్క్ ఫ్రం హోం ఉంటుందని విప్రో తెలిపింది. తమ కార్పొరేట్ ఆఫీసులో 40 శాతం మంది ఆఫీసుల్లోనే పనిచేస్తున్నారని, ఇతర పెద్ద ఆఫీసుల్లో హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తున్నామని యెస్ బ్యాంక్ పేర్కొంది. మగ ఎంప్లాయిస్ వర్క్ ఫ్రం హోంనే కోరుకుంటున్నారని, మహిళల్లో ఎక్కువ మంది ఆఫీసులకు రావడానికి రెడీగా ఉన్నారని హెచ్‌ఆర్ వర్గాలు తెలిపాయి. సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే ట్యాక్ సెక్యూరిటీ ఇండియా తన ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు పనిచేస్తే చాలని ప్రకటించింది. మిగతా మూడు రోజుల్లో వారికి తగిన విశ్రాంతి దొరకడం వల్ల ఉత్సాహంగా పనిచేస్తారని పేర్కొంది. పని–జీవితం మధ్య బ్యాలెన్స్ ఉంటేనే, ఉద్యోగుల్లో ప్రొడక్టివిటీ పెరుగుతుందని కంపెనీ తెలిపింది. తాము ఈ నిర్ణయం ప్రకటించిన తరువాత తమ ఉద్యోగుల్లో చాలా మంది కొత్త విషయాలను నేర్చుకుంటున్నారని, కొందరు కొత్త కోర్సుల్లో చేరారని కంపెనీ సీఈఓ తృష్ణీత్ అరోరా అన్నారు.