ముంబై, సెప్టెంబర్ 30,
దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో నగరీకరణ పెరుగుతున్నది. ఫలితంగా రోడ్లపై ట్రాఫిక్ భారీగా పెరుగుతున్నది. కిలోమీటర్ దూరం ప్రయాణానికి గంటల సమయం పడుతున్నది. ఇక అంబులెన్స్ వంటి వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఎగిరిపోయే కార్లు వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంటుంది. అలాంటి ఎగిరే కార్లు త్వరలోనే దేశంలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఆసియాలోనే మొదటి ఎగిరే కారు ఇండియాలోనే తయారు కాబోతున్నది. ఇండియన్ స్టార్టప్ సంస్థ వినతా ఏరోమొబిలిటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ కారును డిజైన్ చేసింది. ఈ కాన్సెప్ట్ కారును ఇప్పటికే కేంద్ర పౌరవిమాయాన శాఖ మంత్రికి కూడా చూపించారు. ఈ కాన్సెప్ట్ కారుపై ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనికి అనుమతులు వచ్చే అవకాశం ఉన్నది. లండన్‌లో జరిగే హెలిటెక్ ఎక్స్‌పోలో ఈ కాన్సెప్ట్ కారు మోడల్‌ను ప్రదర్శించబోతున్నారు. ఇంజన్ సామర్థ్యం తదితర విషయాలు హెలిటెక్ ఎక్స్‌పోలో వెల్లడించే అవకాశం ఉన్నది. ఇందులో ఇద్దరు కూర్చోని ప్రయాణం చేసేందుకు వీలుగా డిజైన్ చేశారు. హైబ్రీడ్ కారు కావడంతో విద్యుత్‌తో పాటుగా బయోఇంథనంతో నడుస్తుంది. ఈ కారు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాల్లో ప్రయాణం చేస్తుంది. ప్రయాణికులతో పాటుగా మెడిసిన్‌ను కూడా చేరవేసేందుకు ప్రత్యేకంగా ఈ కార్లను వినియోగించుకోవచ్చు. ఈ కార్లు అందుబాటులోకి వస్తే నగరాల్లో చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది.