హైదరాబాద్ సెప్టెంబర్ 30,
జనాభా గణనలో కుల గణన చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకాపోతే ఉద్యమమే అఖిలపక్ష రాజకీయ పార్టీల హెచ్చరిక.
జనాభా గణనలో కుల గణన చేయాలని, ఎల్.ఐ.సి, రైల్వే, బ్యాంకింగ్, పోర్టులు తదితర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. హైదరాబాదు లకిడికపూల్ లోని ఒక హోటల్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కాంగ్రెస్, టి.ఆర్.ఎస్, సి.పి.ఎం, సి.పి.ఐ, టీ.జే.ఎస్, ఎన్సిపి, బిఎస్పి తదితర పార్టీలకు చెందిన నాయకులు హాజరై డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీ నేతలు వి.హనుమంతరావు (కాంగ్రెస్), మల్లు రవి (కాంగ్రెస్), ఎల్.రమణ (టిఆర్ఎస్), ప్రో. కోదండరామ్ (టిజేఎస్), అజీజ్ పాషా, బాల మల్లేష్ (సిపిఐ), రవీందర్ (ఎన్సిపి), ప్రభాకర్, చిరంజీవి (బిఎస్పి), బిసి యువజన సంఘం రాష్ట్ర అద్యక్షులు నీల వెంకటేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సమావేశానికి 92 బి.సి కుల సంఘాలు పాల్గొన్నారు. కుల గణన చేయకపోతే బిజేపి కి బి.సిలు ఓట్లు వెయ్యరని కుల సంఘాలు హెచ్చరించాయి.ఒక్క పైసా ఖర్చు లేకుండా - ప్రభుత్వానికి ఎలాంటి శ్రమ లేకుండా బీసీ జనాభా లెక్కలు తీసే అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు. జనాభా లెక్కల పట్టికలో 33 కాలమ్స్ ఉన్నవి. కుల గణన చేస్తే ఇంకొక కాలం పెట్టాలి. కానీ బీజేపీ ప్రభుత్వం పెట్టడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఇది పచ్చి బీసీ వ్యతిరేక చర్య. ఈ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేసారు. లేని పక్షం లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి బీసీలు ఉద్యమించాలని నేతలు పిలుపు నిచ్చారు.