దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గంటకు 70 కి.మీ. వేగంతో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. ఆ తీవ్రతకు ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు, గురుగ్రామ్, నోయిడాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం అన్ని సాయంత్రపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఆరుబయట ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని హెచ్చరించింది. ఉత్తర భారతదేశంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకూ తుపానులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. రాజస్తాన్లో ఇసుక తుపానులు, ఆరు రాష్ట్రాల్లో గాలి దుమారంతో పాటు వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించింది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం గంటకు 50–70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశాలు వున్నాయని తెలిపింది. తుఫాను హెచ్చరికల నేపధ్యంలో డీఎంఆర్సీ అప్రమత్తమైంది. తుఫాను సమయంలో కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా మెట్రో సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అండర్ గ్రౌండ్ స్టేషన్లలో రైళ్లు సామాన్యంగానే నడుస్తాయి. అయితే ఎలివేటెడ్ స్టేషన్లలో ట్రైన్లను గంటకు 40 కి.మీ.ల వేగంతోనే నడపాల్సివుంటుందని అధికారులు వెల్లడించారు.