జనంలోకి జనసేనాని
విజయవాడ, అక్టోబరు 2,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు. పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన కూడా చేయాలని నిర్ణయించారు. నమ్మకమైన నేతలకు ఇక పదవులు ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా గత ఏడేళ్లుగా తన వెన్ంనటి నడుస్తున్న వారికే పదవులు ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. తనను నమ్మించి వచ్చిన కొందరు నేతలు పార్టీని వదిలేసి వెళ్లిపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.జనసేనలో పదవులు ఇచ్చిన మాదాసు గంగాధరం, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు పార్టీని వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరికొందరు జిల్లా స్థాయి నేతలు కూడా పార్టీని వదిలి వెళ్లారు. వారిని నమ్మి పార్టీలో తీసుకుని కీలక పదవులను పవన్ కల్యాణ్ ఇచ్చారు. కానీ కష్టకాలంలో వదలి వెళ్లడంతో ఇకపై పార్టీ పదవులు లాయల్టీ ఉన్న వారికే ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారంటున్నారు.రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కూడా ముందుగానే చేయాలని డిసైడ్ అయ్యారు. తమకు బలమున్న ప్రాంతాల్లో ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల అడ్వాంటేజీ ఉంటుందని, ప్రజల్లోకి వెళ్లి పనిచేసుకోగలుగుతారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆయన త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు.దీంతో పాటు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం కొన్ని కార్యక్రామాలను కూడా రూపొందించాలని నిర్ణయించారు. బీజేపీతో సంబంధం లేకుండా పార్టీ కార్యాచరణ ప్రణాళికను తయారు చేయనున్నారు. దీనివల్ల జనసేన జెండా జనంలోకి వెళుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. దసరా తర్వాత జిల్లా, మండల స్థాయి నేతలు పవన్ కల్యాణ్ సమావేశమయ్యే అవకాశముంది.