త్వరలో బోర్లకు మీటర్లు
శ్రీకాకుళం, అక్టోబరు 2,
కేంద్ర ప్రభుత్వ షరతులు రాష్ట్రంలోని రైతుల మెడకు చుట్టుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ బోర్లకు డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంటలకు వినియోగిస్తోన్న భూగర్భ జలాలకు లెక్కగట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ద్వారా ఇది అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన షరతుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు బిగిస్తోన్న విషయం విదితమే. శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి కాగా మిగిలిన జిల్లాల్లో అమలు చేస్తోంది. తాజాగా బోర్లకు నీటి మీటర్ల ఏర్పాటుతో రైతుల మెడకు మరో ఉచ్చు బిగిస్తోంది. నీటివనరుల విస్తరణ, నాణ్యత, లభ్యతను పెంపొందించడం లక్ష్యం అంటూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైడ్రాలాజీ ప్రాజెక్టును 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇస్తోంది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలంటే రూ.3,680 కోట్ల బడ్జెట్ అవసరమని అంచనా వేసి, ఇందులో 50 శాతం ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇవ్వనుంది. ప్రాజెక్టు కాలపరిమితి 2016-17 నుంచి 2023-24 వరకు నిర్దేశించింది. 2016 ఏప్రిల్ ఆరో తేదీన మోడీ కేబినెట్ దీన్ని ఆమోదించింది. రుణం కోసం 2017 ఏప్రిల్ 14న ఒప్పందం కుదుర్చుకుంది. కాలపరిమితి సమీపిస్తుండడంతో దీని వేగవంతానికి బిజెపి ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ ప్రాజెక్టు అమలుపై ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా హైడ్రాలజీ ప్రాజెక్టును త్వరిగగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి ఒక్కొక్క గ్రామం చొప్పున ప్రతిపాదనలు పంపాలని భూగర్భ జలశాఖ అధికారులను కోరింది. అందుకనుగుణంగా అధికారులు జాబితాలు రూపొందించి పంపుతున్నారు. పంటల సాగుకు రైతులు ఎంత మొత్తంలో నీటిని వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకేనని అధికారులు పైకి చెప్తున్నా, నీటి వాడకానికి పరిమితి విధించి, అంతకు మించి వాడితే డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు కూడా డిజిటల్ ఫ్లో మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. రోజుకు రెండు లక్షల లీటర్ల కంటే ఎక్కువ నీటిని తోడితే ప్రతి అదనపు లీటరుకూ ధర నిర్ణయించి వసూలు చేయనున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన నాగార్జున అగ్రికెమ్ లిమిటెడ్ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.వి రాజులు వద్ద ప్రస్తావించగా, పరిశ్రమలకు ఫ్లో మీటరు బిగించుకోవాలని నోటీసులు ఇస్తారన్న విషయం తమకూ తెలిసిందన్నారు.వ్యవసాయ బోర్లకు డిజిటల్ ఫ్లో మీటర్ల ఏర్పాటుకు ప్రతి మండలం నుంచి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి జాబితాను ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు రాగానే రైతుల అంగీకారంతో వీటిని బిగిస్తాం. భూగర్భ జలాల్లో హెచ్చుతగ్గులు, రైతులు ఎంత మొత్తంలో నీటిని వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు ఈ మీటర్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.